Ind vs Pak: పాకిస్తాన్ కు క్రికెటర్ల షాక్, సెమి ఫైనల్ క్యాన్సిల్..?
                                    భారత్ – పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల నేపధ్యంలో ఇప్పుడు క్రికెట్ పై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి. అసలు రెండు దేశాలు భవిష్యత్తులో కలిసి మ్యాచ్ లు ఆడే అవకాశం లేదనే సంకేతాలు వస్తున్నాయి. తాజాగా భారత్, పాకిస్తాన్ మధ్య జరగాల్సిన వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్(World Championship of Legends) మ్యాచ్ రద్దు అయ్యే అవకాశం ఉందని జాతీయ మీడియా పేర్కొంది. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల కారణంగా పలువురు భారత ఆటగాళ్లు మ్యాచ్‌ను బహిష్కరించాలని కోరుకుంటున్నారని వెల్లడించింది.
టోర్నమెంట్లో గతంలో పాకిస్థాన్‌తో జరిగిన గ్రూప్-స్టేజ్ మ్యాచ్‌లో తీసుకున్న నిర్ణయాన్నే ఇప్పుడు కూడా కొనసాగించాలని భావిస్తున్నట్టు క్రికెట్ వర్గాలు తెలిపాయి. టోర్నీ నుంచి కూడా పాకిస్తాన్ ను బహిష్కరించాలి అనే డిమాండ్ లు వినిపించాయి. జూలై 31న ఎడ్జ్‌బాస్టన్ క్రికెట్ గ్రౌండ్లో జరిగే ఈ టోర్నమెంట్ సెమీ-ఫైనల్లో భారత్ పాకిస్తాన్‌తో తలపడనుంది. అయితే, మ్యాచ్ ముందు రోజు, భారత జట్టు స్పాన్సర్లలో ఒకరైన ఈజ్‌మైట్రిప్(Ease my trip), ఉగ్రవాదం, క్రికెట్ కలిసి ఉండలేవని పేర్కొంటూ సెమీ-ఫైనల్ మ్యాచ్ నుంచి తప్పుకుంది.
శిఖర్ ధావన్, హర్భజన్ సింగ్ ఈ విషయంలో ముందు నుంచి ఒకే మాట మీద ఉన్నారు. పాకిస్తాన్ విషయంలో ఇద్దరూ వ్యతిరేకంగానే మాట్లాడుతూ వచ్చారు. ఈ టోర్నమెంట్ ప్రభావం.. ఆసియా కప్(Asia Cup) పై కూడా పడే అవకాశం ఉందనే అనుమానాలు వస్తున్నాయి. సెప్టెంబర్ 9 నుంచి ఈ టోర్నీ మొదలు కానుంది. పాకిస్తాన్ – భారత్ ఒకే గ్రూప్ లో ఉండటంతో ఆ దేశంతో భారత్ మ్యాచ్ ఆడే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. ఇది క్రమంగా రాజకీయ రంగు కూడా పులుముకోవడంతో బీసీసిఐ.. ఆ మ్యాచ్ ను బహిష్కరించే అవకాశం ఉందని తెలుస్తోంది.







