అమెరికాలో హైదరాబాదీ విద్యార్థి మృతి
తన సొంత తుపాకీ ప్రమాదవశాత్తు పేలి అమెరికాలో హైదరాబాదీ విద్యార్థి ఒకరు మృతి చెందారు. జార్జియాలోని అట్లాంటాలో ఉన్న కెన్నెసా స్టేట్ యూనివర్సిటీలో ఎంఎస్ రెండో ఏడాది చదివే పాల్వాయి ఆర్యన్ రెడ్డి (23) ఈ నెల 13న మృతి చెందగా విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఉప్పల్‌లోని ధర్మపురికాలనీలో నివసించే పాల్వాయి సుదర్వన్ రెడ్డి, గీత దంపతుల ఏకైక కుమారుడు ఆర్యన్‌రెడ్డి గత ఏడాది డిసెంబరులో ఉన్నత చదువులకు అమెరికా వెళ్లారు. ఈ నెల 13న స్నేహితులతో కలిసి తన పుట్టినరోజు వేడుకలు జరుపుకొన్నారు. అదే రోజు ఆర్యన్ ఉండే గది నుంచి తుపాకీ శబ్దం వచ్చింది. స్నేహితులు వెళ్లి చూసేసరికే అతడి ప్రాణం పోయింది. తూటా ఛాతీ లోపలికి దూసుకుపోవడంతో అక్కడికక్కడే ఆర్యన్ మృతి చెందారు. తుపాకీని శుభ్రం చేసే సమయంలో ప్రమాదవశాత్తు ( మిసైఫైర్) పేలి ఆర్యన్ మృతి చెంది ఉంటాడని ఆయన తండ్రి సుదర్శన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.






