అమెరికాలో హెలీన్ కల్లోలం
అమెరికాలో హెలీన్ హరికేన్ కల్లోలానికి ఇంకా తెరపడటం లేదు. దాని దెబ్బకు మృత్యువాతపడ్డవారి సంఖ్య 107కు (మొత్తం ఆరు రాష్ట్రాల్లో) పెరిగింది. ఉత్తర కరోలినా రాష్ట్రంలో ఒక్క ఆషెవిలె నగరంలోనే హరికేన్ 30 మంది ప్రాణాలను బలితీసుకుంది. వరదల్లో చిక్కుకొని, రోడ్లు తెగిపోయి, విద్యుత్తు సరఫరా నిలిచిపోయిన పలు ప్రాంతాలకు సహాయక బృందాలు చేరుకుంటున్నాయని ఉత్తర కరోలినా గవర్నర్ రాయ్ కూపర్ తెలిపారు. సహాయక చర్యలు కొనసాగే కొద్దీ మరిన్ని మృతదేహాలు బయటపడే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జార్జియా రాష్ట్రంలో మరణాల సంఖ్య సోమవారం 25కు చేరుకుంది.






