Ind vs Eng: గంభీర్ వర్సెస్ పిచ్ క్యూరేటర్.. ఓవల్ లో కొత్త గొడవ..!

టీం ఇండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir) వర్సెస్, ఓవల్ పిచ్ క్యూరేటర్ మధ్య మాటల యుద్ధం సంచలనంగా మారింది. మంగళవారం మధ్యాహ్నం ఓవల్‌లో పిచ్ క్యూరేటర్ లీ ఫోర్టిస్‌తో గంభీర్ మాటల యుద్దానికి దిగాడు. భారత్ – ఇంగ్లాండ్ మధ్య జరిగే ఐదవ, చివరి టెస్ట్ కోసం ఆటగాళ్ళు ప్రాక్టీస్ మొదలుపెట్టగా ఆ సమయంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. ప్రాక్టీస్ కు భారత్ కు కల్పించిన సౌకర్యాలపై గంభీర్ అసహనం వ్యక్తం చేసాడు. కీలకమైన మ్యాచ్ కు ముందు భారత్ కు సరైన ప్రాక్టీస్ అవసరమన్నాడు.
ఇక్కడ గంభీర్ వేలు చూపించి మాట్లాడటం వివాదాస్పదం అయింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ సమయంలో పరిస్థితి తీవ్ర రూపం దాల్చడంతో.. బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ జోక్యం చేసుకుని ఇద్దరినీ వేరు చేసాడు. జాతీయ మీడియా కథనం ప్రకారం.. గంభీర్ ప్రవర్తనపై తాము రిపోర్ట్ చేస్తామని పిచ్ క్యూరేటర్ వార్నింగ్ ఇచ్చాడట. దీనికి గంభీర్ కూడా అదే స్థాయిలో సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. నచ్చిన చోట రిపోర్ట్ చేసుకోమని సమాధానం ఇచ్చాడు.
లీ ఫోర్టిస్ బెదిరించే విధంగా మాట్లాడటంతోనే గంభీర్ ఆ విధంగా రియాక్ట్ అయినట్టు భారత క్రికెట్ వర్గాలు తెలిపాయి. మాకు ఏం చేయాలో నువ్వు చెప్పవద్దు అంటూ గంభీర్ సీరియస్ అయ్యాడు. దీనిపై మీడియా సమావేశం ఏర్పాటు చేస్తే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాగా గంభీర్, ఓవల్ గ్రౌండ్(Oval Ground) స్టాఫ్ మధ్య జరిగిన ఘర్షణ ఫలితంగా భారత జట్టు భద్రతా అధికారిని పిలిచినట్టు తెలుస్తోంది. ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంలో ఉంది.