G7 Summit : ట్రంప్ వెళ్లిపోవడంతో.. జీ6గా మారిన జీ7
ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అర్థంతరంగా వెళ్లిపోవడంతో కెనడా (Canada)లో జరుగుతున్న జీ7 సదస్సు(G7 Summit) కళ తప్పింది. సదస్సులో పాల్గొన్న కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్ అధినేతలు ఆరుగురు రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై చర్చించారు. ఈ సదస్సులో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ (Zelensky), నాటో చీఫ్ మార్క్ రూట్ (Mark Root) పాల్గొన్నారు. రష్యా జరిపిన దాడిలో 15 మంది మరణించారని, 150మందికి పైగా గాయపడ్డారని జెలెన్స్కీ తెలిపారు. దాడులతో ఉక్రెయిన్ ప్రజలు ప్రభావితం అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు భాగస్వామ్య దేశాల మద్దతు కావాలని కోరారు. అంతకుముందు జరిగిన సమావేశంలో ట్రంప్ పాల్గొన్నారు. ఇరాన్ అణ్వాయుధాన్ని సమకూర్చుకోవడాన్ని అంగీకరించబోమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గాలని, గాజాలో కాల్పులు విరమణ అమలు కావాలని సూచించారు. రష్యాపై సుంకాలను విధిద్దామని ఐరోపా దేశాల నేతలు ప్రతిపాదించగా ట్రంప్ తిరస్కరించారు.







