భారత్ శాశ్వత సభ్యత్వానికి ఫ్రాన్స్ మద్దతు
ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు ఫ్రాన్స్ మద్దతు ప్రకటించింది. శక్తిమంతమైన భద్రతామండలిని వెంటనే విస్తరించాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పింది. న్యూయార్క్లో ఐరాస సర్వసభ సమావేశంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ప్రసంగించారు. ప్రస్తుతం భద్రతామండలి స్తంభించింది. దాన్ని మరింత సమర్థంగా తీర్చిదిద్దాలి. అందులో మరిన్ని దేశాలకు ప్రాతినిధ్యం కల్పించాలి. భారత్, జర్మనీ, జపాన్, బ్రెజిల్లను భద్రతామండలిలో శాశ్వత సభ్యదేశాలుగా చేర్చుకోవాలి. వాటితో పాటు రెండు ఆఫ్రికా దేశాలనూ తీసుకోవాలి. ఆ రెండు దేశాలు ఏవన్నది నిర్ణయించుకునే అధికారం ఆఫ్రికాకే ఇవ్వాలి అని ఆయన పేర్కొన్నారు. భద్రతామండలి పనితీరు కూడా మారాలని, కొన్ని అంశాల్లో వీటో అధికారంపై పరిమితులు ఉండాలని మెక్రాన్ అభిప్రాయపడ్డారు.






