Electric Airplane: అమెరికాలో ఈవీ విమానం వచ్చేసింది

విమానయాన రంగంలో ఒక సరికొత్త అధ్యాయం ఆవిష్కృతమైంది. అమెరికాకు చెందిన బీటా టెక్నాలజీస్ (Beta Technologies) అనే కంపెనీ విమానయానరంగ చరిత్రలో తొలిసారిగా ఈవీ విమానాన్ని (Electric Airplane) రూపొందించి, విజయవంతంగా నడిపింది. నలుగురు ప్రయాణికులతో న్యూయార్క్ పోర్ట్ అథారిటీ పరిధిలోని ఈస్ట్ హాంప్టన్ (East Hampton) నుంచి జాన్ ఎఫ్ కెన్నడీ విమానాశ్రయం (John F. Kennedy Airport) వరకు సాగిన ఈ ప్రయాణం, ఒక మైలురాయిగా నిలిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ చారిత్రక ప్రయాణంలో ముఖ్యమైన అంశం. దాని ఖర్చు సుమారు 130 కిలోమీటర్ల దూరానికి అయిన ఇంధన ఖర్చు కేవలం 8 అమెరికన్ డాలర్లు (సుమారు రూ.700) మాత్రమే. ఈ విజయం ప్రాంతీయ విమాన ప్రయాణాల్లో విప్లవాత్మక మార్పులకు నాంది పలకనుందని బీటా టెక్నాలజీస్ సీఈఓ కేల్ క్లార్క్ (Cale Clark) వెల్లడించారు . పైలట్‌కు ఇచ్చే వేతనం, విమానం నిర్వహణ వ్యయం వంటి ఇతరత్రా ఖర్చులున్నా, ఈవీతో మొత్తం ఖర్చు గణనీయంగా తగ్గిపోయిందని చెప్పారు. విమానం లోపల ఎటువంటి శబ్దం ఉండదని, కాబట్టి, ప్రయాణికులు ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం కూడా చాలా సులువవుతుందని తెలిపారు.