విదేశీ విద్యార్థులపై బహిష్కరణ.. త్వరలో 70 వేల మందికి పైగా
కెనడాలో చదువుతున్న విదేశీ విద్యార్థులు ప్రస్తుతం బహిష్కరణ ముప్పును ఎదుర్కొంటున్నారు. ఫెడరల్ ఇమిగ్రేషన్ విధానాల్లో మార్పుల కారణంగా 70 వేల మందికి పైగా అంతర్జాతీయ గ్రాడ్యుయేట్ విద్యార్థులు త్వరలో దేశాన్ని వదిలి వెళ్లాల్సి ఉంటుంది. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. స్టడీ పర్మిట్లను పరిమితం చేస్తూ, శాశ్వత నివాస నామినేషన్లను తగ్గించాలని ట్రూడో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఇప్పుడు విద్యార్థులు దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో పెరుగుతున్న ఇళ్ల కొరత, నిరుద్యోగ సమస్యకు చెక్ పెట్టడం కోసమే స్టడీ పర్మిట్లలో కోత విధించినట్లు ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు తక్కువ వేతనాలకు ఉద్యోగాలు చేస్తున్న తాత్కాలిక విదేశీ కార్మికుల సంఖ్యను కూడా తగ్గిస్తున్నట్లు ప్రధాని ట్రూడో తాజాగా ప్రకటించడం అగ్గి రాజేసింది.






