Ind vs Eng: క్రికెట్ ఛాన్స్ ఇస్తుందా..? నిలకడ అరంగేట్రం చేయిస్తుందా..?
భారత్ – ఇంగ్లాండ్ (India-England) జట్ల మధ్య తొలి టెస్ట్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న నేపధ్యంలో.. తుది జట్టులో ఎవరు ఉంటారనే దానిపై క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చలే జరుగుతున్నాయి. సీనియర్ ఆటగాళ్ళ రిటైర్మెంట్ తర్వాత జరుగుతోన్న తొలి పర్యటన కావడంతో.. యువ ఆటగాళ్ళు ఎంత వరకు ప్రభావం చూపిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా సాయి సుదర్శన్(Sai sudharshan), కరుణ్ నాయర్(Karun Nair), అభిమన్యు ఈశ్వరన్, అర్శదీప్ సింగ్ విషయంలో జట్టులో క్లారిటీ రాకపోవడం అభిమానుల్లో తెలియని టెన్షన్ పెంచేస్తోంది.
ఈ నాలుగు స్థానాలు ఇప్పుడు కెప్టెన్ కు సవాల్ గా మారాయి. నలుగురూ నిలకడ ఉన్న ఆటగాళ్లే. కరుణ్ నాయర్ దేశవాళి సీజన్ తో పాటుగా ఐపిఎల్ లో కూడా ఆకట్టుకున్నాడు. ఇంగ్లాండ్ లయన్స్ తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో డబుల్ సెంచరీ కూడా చేసాడు. దీనితో అతను మూడవ స్థానంలో బ్యాటింగ్ చేయాలనేది అభిమానుల కోరిక. కాని ఇక్కడ సాయి సుదర్శన్ నుంచి తీవ్ర పోటీ నెలకొంది. సాయి సుదర్శన్ కు ఇంగ్లాండ్ లో కౌంటీ మ్యాచ్ లు ఆడిన అనుభవం ఉంది. దీనితో అతను మూడవ స్థానంలో బ్యాటింగ్ చేయవచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి.
ఈ ఇద్దరికీ అభిమన్యు ఈశ్వరన్ నుంచి కూడా పోటీ ఎదురు అవుతోంది. అతను ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక అయినా సరే ఆడలేదు. దీనితో అతనికి ఇంగ్లాండ్ లో అవకాశం ఇచ్చే సూచనలు ఉన్నాయి. అతను కూడా జట్టులో చోటు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ముగ్గురూ ఆడే అవకాశం లేదు కాబట్టి ఎవరికి చోటు దక్కవచ్చు అనేది చెప్పలేని పరిస్థితి. ఇక అర్శదీప్ సింగ్ విషయానికి వస్తే.. ఇతనికి జట్టులో చోటు ఖాయమే కాని.. ప్రసిద్ కృష్ణ నుంచి పోటీ ఎదురు కావచ్చు. కాని జట్టులో లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ ఇతను ఒక్కడే. ఇంగ్లాండ్ లో స్వింగ్ కు అనుకూలించడం, ఇతను బంతిని స్వింగ్ చేయగలిగే సత్తా ఉండటంతో ఖచ్చితంగా జట్టులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇంగ్లాండ్ లో కౌంటీ మ్యాచ్ లు ఆడిన అనుభవం కూడా అతని సొంతం. చూద్దాం మరి ఎవరికి అవకాశం దక్కుతుందో…?







