Russia: అమెరికాకు భారత్ షాక్.. రష్యాతో వాణిజ్యం పెంపుదిశగా చర్యలు..

అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ప్రపంచాన్ని భౌగోళికంగా రెండుగా విభజించేశారు. ఎందుకంటే.. ఇప్పుడు ఏ దేశమైనా.. ఏదో పక్షాన చేరక తప్పనిసరి పరిస్థితి కల్పించారు.మొన్నటివరకూ అలీనోద్యమ పంధాలో ఉంటూ.. స్వతంత్ర విదేశాంగ విదేశీ విధానం కలిగిన భారత్ సైతం… ఇప్పుడు మిత్రదేశమైన రష్యాకు మరింత దగ్గరయ్యేలా చేశారు ట్రంప్. ఫలితంగా ఇప్పుడు అమెరికా ఆంక్షల వేళ భారత్- రష్యా వ్యాపార పరంగా కలిసికట్టుగా ముందుకు సాగాలని నిర్ణయించాయి.
భౌగోళిక రాజకీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు రష్యా, భారత్‌లు నూతన మార్గాలు అన్వేషించి ముందుకుసాగాలని విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ (S Jaishankar) పేర్కొన్నారు. ఇందులోభాగంగా భారత్‌లోని కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించిన ఆయన, తద్వారా వ్యాపారాన్ని మరింత విస్తృత పరచుకోవాలని పిలుపునిచ్చారు. రష్యా(Russia) నుంచి చమురు కొనుగోలు ఆపాలని అమెరికా ఒత్తిడి తెస్తున్న వేళ మాస్కోలో కీలక పర్యటన చేపట్టిన జైశంకర్.. ఇరుదేశాలు సృజనాత్మకంగా ముందుకుసాగాలన్నారు.
ఈక్రమంలో రష్యాలో పర్యటిస్తున్న జైశంకర్.. రష్యా ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ డెనిస్ మంటురోవ్‌తో భేటీ అయ్యారు. వాణిజ్యం, ఆర్థిక, సాంకేతిక, సాంస్కృతిక అంశాలపై చర్చలు జరిపారు. ఈ ఏడాది చివరలో భారత్‌లో పుతిన్ పర్యటనకు సంసిద్ధత లక్ష్యంతో విదేశాంగ మంత్రి పర్యటన కొనసాగుతోంది.
ఈసందర్భంగా ఇరుదేశాలు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవడంతోపాటు వివిధ అంశాల్లో సహకరించుకోవాలని జైశంకర్ పిలుపునిచ్చారు. ఎక్కువగా, విభిన్నంగా చేయడమే ఇరువురి వాణిజ్యసూత్రంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోన్న ఆర్థికవ్యవస్థ అని గుర్తుచేసిన ఆయన.. మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలతో విదేశీ వాణిజ్యానికి కొత్త ద్వారాలు తెరిచిందన్నారు. భారత్‌లో రష్యా కంపెనీల వ్యాపార విస్తరణకు ఇది మరింత దోహదం చేస్తుందన్నారు.