US Visa : నాన్ ఇమిగ్రెంట్ వీసా నిబంధనలు కఠినతరం.. సెప్టెంబర్ 2 నుంచి కొత్త రూల్స్

అమెరికా వీసా నిబంధనలను మరింత కఠినతరం చేసింది. దీంతో అమెరికాకు విద్య (Education), ఉపాధి కోసం వెళ్లాలనుకునేవారే కాకుండా పర్యాటకులు (Tourists) కూడా ప్రభావితం కానున్నారు. ఈ నిబంధనలు వచ్చే సెప్టెంబర్ 2 నుంచి అమలులోకి రానున్నాయి. నాన్ ఇమిగ్రెంట్ (Non-immigrant) (వలసదారుడు కానివారు) వీసా దరఖాస్తుల కోసం అమెరికా విదేశాంగ శాఖ కఠిన నిబంధనలను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ నిబంధనల ప్రకారం వీసా కోసం దరఖాస్తు చేసుకొనేవారు ఎవరైనా సరే వ్యక్తిగతంగా ఇంటర్వ్యూ (Interview)లకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇంతకుముందు 14 ఏండ్లలోపు బాలలకు, 79 ఏండ్లు దాటిన వృద్ధులకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఉండేది.
అమెరికా తీసుకొచ్చిన వీసా నిబంధనల్లో మార్పులు భారతీయులపైనే అధిక ప్రభావం చూపనున్నాయి. బిజినెస్ (Business) /పర్యాటకులు, బాలలు, వృద్ధులు కూడా వ్యక్తిగతంగా ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉండటంతో కాన్సులేట్ కార్యాలయాల వద్ద వేచి ఉండే గడువు భారీగా పెరుగుతుంది. కాలేజీ అడ్మిషన్లు లేదా సెలవుల వంటి పీక్ సీజన్‌లో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. ఇంతకుముందు విద్యార్థుల్లో కొందరికి డ్రాప్-బాక్స్ ప్రాతిపదికన ఇంటర్వ్యూలకు మినహాయింపు ఉండేది.