Tibet: బ్రహ్మపుత్రనదిపై చైనా వాటర్ బాంబ్.. భారత్ తట్టుకోగలదా…?

ఆసియా పులిగా తానే ఉండాలి.. ఇంకొకరు అటువైపు వచ్చినా సరే చైనా తట్టుకోలేదు. దాన్ని ఎలాగోలా ఇబ్బందుల పాల్జేసి.. తన కసి తీర్చుకుంటుంది. కాదు.. కాదు పంజా దెబ్బ రుచిచూపిస్తుంది. ఓవైపు స్నేహగీతం పాడుతూనే.. మరోవైపు వాటర్ బాంబ్ సిద్ధం చేస్తోంది. ఇది కూడా బ్రహ్మపుత్రనదిపై …ఈ వాటర్ బాంబ్ చాలా శక్తిమంతమైనదన్న ఆందోళనలో భారత్ లోనే వ్యక్తమవుతున్నాయి. మరోవైపు.. కేంద్రం కూడా ఈ విషయంలో తమ అభ్యంతరాలను చైనా దృష్టికి తీసుకెళ్లింది.
ఇంతకూ ఏమిటా వాటర్ బాంబ్…?
భారత సరిహద్దుకు సమీపంలో టిబెట్‌లోని బ్రహ్మపుత్ర నదిపై చైనా ప్రపంచంలోనే అత్యంత భారీ జల విద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ప్రతి విషయానికి భారత్‌తో కయ్యానికి కాలుదువ్వే డ్రాగన్ సరిహద్దులో చేపడుతున్న ఈ అతి పెద్ద నిర్మాణం దేశానికి సవాల్‌గా మారబోతోందా.. డ్రాగన్ ఈ ప్రాజెక్టును వ్యూహత్మంగా నిర్మిస్తోందా.. ఈ ప్రాజెక్టుతో భారత్‌కు భారీ నష్టం జరుగుతుందా.. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన దృశ్యాలను చైనా తొలిసారిగా బహిర్గతం చేసిన వేళ దీనిపై ఇలా అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. బ్రహ్మపుత్ర నదిపై అత్యంత భారీ జల విద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణానికి ఈ నెల 19న చైనా ప్రధాని లీ కియాంగ్ శంకుస్థాపన చేశారు. దాదాపు 14 లక్షల కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుపై మన దేశంలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనివల్ల మనకు నీటిపరంగా నష్టం జరిగే అవకాశం ఉందని, ఇరు దేశాల మధ్య బలమైన ద్వైపాక్షిక నీటి పంపిణీ వ్యవస్థ ఉండాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఆది నుంచే భారత్ ఆందోళన
ఈ ప్రాజెక్టుపై ఆది నుంచే భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. హిమాలయాల్లో టిబెట్ నుంచి అరుణాచల్ ప్రదేశ్‌కు నది గమనంలో వంపు తిరిగేచోట ఈ డ్యాంను నిర్మిస్తున్నారు. భారీ డ్యాం నిర్మాణంవల్ల ఇక్కడ పర్యావరణానికి తీరని నష్టం కలగవచ్చనే విమర్శలున్నాయి. ప్రాజెక్టు కారణంగా అరుణాచల్‌తోపాటు అస్సాం రాష్ట్రాలపై ప్రతికూల ప్రభావం పడుతుందనే ఆందోళనలను భారత్ వ్యక్తం చేస్తోంది. ఒకవేళ రెండు దేశాల మధ్య సంఘర్షణ తలెత్తితే చైనా ఈ డ్యాం నుంచి ఒక్కసారిగా భారీ పరిమాణంలో నీటిని విడుదల చేస్తే భారత్‌లోని భూభాగాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. అందుకే దీన్ని వాటర్ బాంబ్‌గా అభివర్ణిస్తున్నారు.
మరోవైపు ఎగువ ప్రాంతాల్లో నిర్మించే ప్రాజెక్టులవల్ల దిగువన ఉన్న ప్రాంతాలకు హాని కలగకుండా చూసుకోవాలని చైనాకు ఇప్పటికే భారత్ సూచించింది. ఇటీవలే చైనాలో పర్యటించిన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్.. ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ఈ అంశంపై చర్చించారు. ఇరు దేశాలు సరిహద్దు నదుల జలాల డేటాను పంచుకోవడంతోపాటు పరస్పరం సహకరించుకోవాలని వారు నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు కారణంగా భారత్, బంగ్లాదేశ్‌పై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండబోదని చైనా చెబుతోంది. భారత్‌లోనూ బ్రహ్మపుత్ర నదీ ప్రవాహంపై ఎలాంటి ప్రభావం చూపబోదని పేర్కొంది. బ్రహ్మపుత్ర నదిలో మనకు కావాల్సిన నీరు అందుబాటులో ఉందని, చైనా ఉద్దేశపూర్వకంగా నీటిని విడుదల చేస్తేనే మనకు ప్రమాదమని నిపుణుడు ఉత్తమ్ కుమార్ సిన్హా అభిప్రాయపడ్డారు.
త్రీగోర్జెస్ డ్యాం కంటే 3 రెట్లు పెద్దది
టిబెట్‌లోని నైంగ్చీ నగరంలో భారీ స్థాయిలో విద్యుదుత్పత్తి లక్ష్యంగా ఈ ప్రాజెక్టును చైనా చేపడుతోంది. దీని ద్వారా ఏటా 300 బిలియన్ కిలోవాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయనుంది. ఇది గతంలో చైనా నిర్మించిన ప్రపంచంలోనే అతి పెద్దదైన త్రీగోర్జెస్ డ్యాం కంటే 3 రెట్లు పెద్దది.
బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తున్న ప్రాజెక్టుతో ఇప్పటికిప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు. ‘బ్రహ్మపుత్ర నది భారత్‌లో ప్రవహించే కొద్దీ విస్తరిస్తుందేగానీ కుంచించుకుపోదు. ఈ నదిలోని మొత్తం ప్రవాహంలో చైనా నుంచి కేవలం 30-35శాతం జలాలే వస్తాయి. వీటిలో చాలావరకు మంచు కరగడంతోపాటు.. టిబెట్‌లోని పరిమిత వర్షాలవల్ల లభిస్తాయి. ఇక మిగిలిన 65-70శాతం నీరు భారత్ నుంచే లభిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాలాండ్, మేఘాలయాల్లో రుతుపవనాలవల్ల కురిసే వర్షాలవల్లే ఈ నీరు వస్తుంది’ అని వెల్లడించారు.