వీసా నిబంధనలు కఠినతరం… కొత్త నిబంధనలు జారీ చేసిన కెనడా
కెనడా ప్రభుత్వం బహుళ ప్రవేశ వీసాల జారీ నిబంధనలను కట్టుదిట్టం చేసింది. ఆ మేరకు కొత్త నిబంధనలను విడుదల చేసింది. సింగిల్ ఎంట్రీ వీసా పొందిన వ్యక్తులు ఈ వీసాతో ఒక్కసారి మాత్రమే కెనడాలోకి ప్రవేశించగలరు. బహుళ ప్రవేశ వీసా పొందిన వ్యక్తులు అది చెల్లుబాటయ్యే గడువు వరకు ఎన్నిసార్లు అయినా కెనడాకు రావొచ్చు. తాజా నిబంధనల ప్రకారం గరిష్ఠ కాలానికి జారీ చేసిన బహుళ ప్రవేశ వీసాలను ఇకపై ప్రామాణిక పత్రంగా పరిగణించబోరు. ఏదేని వ్యక్తికి వీసాను సింగిల్ ఎంట్రీకి జారీ చేయాలా? లేక బహుళ ఎంట్రీకి జారీ చేయాలా? అనేది ఇకపై కెనడా ఇమిగ్రేషన్ విభాగం ఐఆర్సీసీ నిర్ణయిస్తుంది. వీసా చెల్లుబాటు గడువును కూడా ఐఆర్సీనే నిర్ణయిస్తుంది. బహుళ ప్రవేశ వీసాలు గరిష్ఠంగా పదేళ్ల వరకు లేదా ట్రావెల్ డాక్యుమెంట్, బయోమోట్రిక్ల చెల్లుబాటు గడువు ముగిసే వరకు ( ఏది ముందు అయితే అదే) చెల్లుబాటు అవుతాయి. గరిష్ఠంగా ఎంతకాలానికి బహుళ ప్రవేశ వీసాను జారీ చేయాలనేది అధికారులే నిర్ణయిస్తారు. ఏ కారణంతో కెనడాకు వస్తున్నారు? వారి ఆరోగ్య పరిస్థితి, కెనడాలో నివసించే కాలానికి అయ్యే వ్యయానికి సరిపడా నిధులు ఉన్నాయా? తదితర కారణాలను పరిశీలించి సింగిల్ ఎంట్రీ వీసా ఇవ్వాలా? లేక బహుళ ఎంట్రీ వీసా ఇవ్వాలా? అనేది నిర్ణయిస్తారు.






