ఈ ఒప్పందానికి భారత్, అమెరికాల పూర్తి మద్దతు : బ్రిటన్
హిందూ మహా సముద్రంలోని చాగోస్ ద్వీప సముదాయంపై సార్వభౌమాధికారాన్ని మారిషస్‌కు బ్రిటన్ అప్పగించింది. ఆ సముదాయంలోని డిగో గార్సియా దీవిని మాత్రం వచ్చే 99 ఏళ్లపాటు బ్రిటన్, అమెరికాల అధీనంలోనే కొనసాగించనుంది. ఈ మేరకు చరిత్రాత్మక ఒప్పందం కుదిరినట్లు బ్రిటన్ ప్రకటించింది. డిగో గార్సియా దీవిలో బ్రిటన్, అమెరికాల సైనిక స్థావరం ఉంది. ఈ ఒప్పందానికి భారత్, అమెరికాల పూర్తి మద్దతు ఉందని బ్రిటన్, మారిషస్ దేశాలు ప్రకటించాయి. మారిషస్‌కు ఈశాన్య దిక్కున 2,200 కిలోమీటర్ల దూరంలో, తిరువనంతపురానికి నైరుతి దిక్కున 1,700 కి.మీ. దూరంలో చాగోస్ ద్వీప సముదాయం ఉంది. వాటిలో 60 దీవులున్నాయి. మారిషస్ ఫ్రెంచి వలస రాజ్యంగా ఉన్నప్పుడు చాగోస్ దీవులపై మారిషస్కే అధికారం ఉండేది. చాగోస్ దీవులపై కుదిరిన ఒప్పందాన్ని భారత్ స్వాగతించింది.






