పాలస్తీనాకు మద్దతుగా అవార్డు నిరాకరించిన భారత సంతతి రచయిత్రి
అమెరికాలోని నోగుచి మ్యూజియం తనకు ప్రదానం చేయదలచిన అవార్డును భారత సంతతి రచయిత్రి ఝంపా లాహిరి తిరస్కరించారు. గాజాలో పాలస్తీనావాసులకు మద్దతుగా తలపై కఫియే వస్త్రాలను ధరించి ముగ్గురు ఉద్యోగులను న్యూయార్క్‌లోని నోగుచి మ్యూజియం నిర్వహకులు ఇటీవల ఉద్వాసన పలికారు. దీనికి నిరసనగా లాహిరి అవార్డును తిరస్కరించారు. ఈ మ్యూజియంను 40 ఏళ్ల క్రితం ఇసామూ నోగుచి అనే జపాన్ శిల్పి, డిజైనర్ స్థాపించారు. ఆయన పేరిట నెలకొల్పిన అవార్డును లాహిరికీ, కొరియా కళాకారుడు లీ ఉఫాన్కు వచ్చే నెలలో ప్రదానం చేయాల్సి ఉంది. లండన్‌లో భారతీయ సంతతి తల్లిదండ్రులకు జన్మించిన రaంపా లాహిరికి 2000లో పులిట్జర్ బహుమతి లభించింది. నోగుచి మ్యూజియం ఉద్యోగులు రాజకీయ నినాదాలు, ప్రతీకలను ప్రదర్శించే వస్త్రాలను, ఇతర ఉపకరణాలను ధరించకూడదని నిర్వాహకులు ఈ నెలారంభంలో ఆంక్షలు విధించారు.






