మీట్ అండ్ గ్రీట్ లో స్పీకర్ ప్రసాద్ కుమార్
తెలుగు ప్రజలది ఉమ్మడి కుటుంబమని, ప్రపంచంలో ఎక్కడ ఉన్న తెలుగువారంతా ఒక్కటేననని తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయినా అభివృద్ధిలో అన్మదమ్ములుగా ఉంటున్నామన్నారు. ఆస్ట్రేలియలోని సిడ్నీలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్, దీపావళి సంబరాల్లో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, శాసనసభ కార్యదర్శి వి. నర్సింహాచార్యులుతో కలిసి స్పీకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి కష్టపడుతున్నారరని, ఆయనకు మనమంతా అండగా ఉండాలన్నారు. రైతులకు రుణమాఫీ, ఫోర్త్‌సిటీ, స్కిల్స్ విశ్వవిద్యాలయం, మూసీ పునరుజ్జీవం, హైడ్రా వంటి కార్యక్రమాలను వివరిస్తూ ఇవన్నీ బంగారు భవిష్యత్తు కోసమేనని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రత్యేక పారిశ్రామిక విధానం ఉందన్నారు. అమెరికా ఎన్నికల్లో ఆరుగురు సెనేటర్లుగా మన దేశ మూలాలు ఉన్నవారు ఎన్నిక కావడాన్ని గుర్తు చశారు. మన దేశ ప్రజలు శాంత స్వభావులని, తమ పని తాము చేసుకుపోతారన్నారు. అందుకే భారతీయులంటే ప్రపంచ దేశాలకు ప్రేమ, అభిమానం అని వివరించారు. కార్యక్రమ నిర్వాహకులు రాజశేఖర్‌రెడ్డి, నవనీత్ రెడ్డి, దేవిప్రసాద్, రవీందర్ రెడ్డి, శ్రీకాంత్, డేవిడ్‌రాజు పాల్గొన్నారు.






