Ind vs Eng: ఆ ముగ్గురూ అవుట్, జట్టులోకి కొత్త బౌలర్
                                    టెండూల్కర్ – అండర్సన్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్ తో జరగనున్న 5వ టెస్ట్ విషయంలో భారత్ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. నాలుగో టెస్ట్ లో బౌలింగ్ లోపాలు జట్టును తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. ముఖ్యంగా అరంగేట్రం చేసిన అన్షుల్ కాంబోజ్ తీవ్రంగా నిరాశపరిచాడు. అతని బౌలింగ్ లో వేగం లేకపోవడంతో ఇంగ్లాండ్ ఆటగాళ్ళు భారీగా పరుగులు సాధించారు. అటు బూమ్రా కూడా నాలుగో టెస్ట్ లో ఫెయిల్ కావడంతో ఆందోళన మొదలైంది. దీనితో 5వ టెస్ట్ పై ఫోకస్ పెట్టారు.
ఈ మ్యాచ్ లో బూమ్రాకు రెస్ట్ ఇవ్వాలని భావిస్తోంది యాజమాన్యం. బూమ్రా ప్రస్తుతం ప్రాక్టీస్ కు కూడా దూరంగా ఉన్నట్టు సమాచారం. అతని స్థానంలో అర్శదీప్ సింగ్ అరంగేట్రం చేయడం దాదాపుగా ఖాయమైంది. 140 కిలోమీటర్ల వేగంతో బంతులు వేయగల సమర్ధుడు అర్శదీప్ సింగ్(Arshadeep Singh). ఇంగ్లాండ్ లో కౌంటీ క్రికెట్ ఆడిన అనుభవం కూడా ఉంది. దీనితో అతనికి అవకాశాలు ఇవ్వాలనే డిమాండ్ లు వినిపించాయి. అయితే నాలుగో టెస్ట్ కు ముందు గాయం ఇబ్బంది పెట్టడంతో దూరమయ్యాడు.
తిరిగి కోలుకోవడంతో అతనిని తుది జట్టులోకి తీసుకోవడం ఖాయంగా కనపడుతోంది. లెఫ్ట్ హ్యాండ్ పేసర్ కావడం కలిసి వచ్చే అంశం. ఇక శార్దుల్ ఠాకూర్ స్థానంలో కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav)తుది జట్టులోకి రానున్నాడు. అన్షుల్ కాంబోజ్ స్థానంలో ఆకాష్ దీప్ ఆడే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో గెలవకపోయినా, డ్రా చేసినా సరే సీరీస్ ఇంగ్లాండ్ వశం అవుతుంది. అందుకే జట్టు యాజమాన్యం బౌలింగ్ విభాగంపై ప్రధానంగా దృష్టి సారించింది. ఈ నెల 31 నుంచి 5వ టెస్ట్, ఓవల్ లో మొదలుకానుంది.







