Kafala: సౌదీలో కఫాలా వ్యవస్థ రద్దు.. 26 లక్షల మంది భారతీయులకు ఊరట!

లక్షలాది వలస కార్మికుల జీవితాలను దశాబ్దాలుగా నరకప్రాయం చేసిన వివాదాస్పద కఫాలా (Kafala) వ్యవస్థను సౌదీ అరేబియా అధికారికంగా రద్దు చేసింది. ఈ ఏడాది జూన్‌లో దీనిపై ప్రకటన వెలువడినప్పటికీ, తాజాగా ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. వలసదారుల హక్కులు, సంక్షేమంలో ఇది ఒక చారిత్రక ముందడుగు అని నిపుణులు భావిస్తున్నారు. ఈ (Kafala Abolishment) నిర్ణయంతో ఇక్కడ పనిచేస్తున్న 13 మిలియన్లకు పైగా ఉన్న వలస కార్మికులకు లబ్ధి చేకూరుతుందని నిపుణులు భావిస్తున్నారు. వీరిలో కనీసం 26 లక్షల మంది భారతీయులు ఉన్నట్లు సమాచారం.
‘కఫిల్’ (స్పాన్సర్) అనే పదం నుంచి ‘కఫాలా’ (Kafala System) వ్యవస్థ వచ్చింది. ఈ విధానంలో పని కోసం వచ్చిన వలస కార్మికుల పాస్‌పోర్టులను గల్ఫ్ దేశాల్లోని యజమానులు స్వాధీనం చేసుకుంటారు. ఈ ప్రాంతంలో చమురు నిల్వలు కనిపించిన కొత్తల్లో తక్కువ ఖర్చుతో పనివాళ్లను సమకూర్చుకునేందుకు ఈ (Kafala System) విధానాన్ని తెచ్చారు. ఆ తర్వాత ఈ వ్యవస్థను ఉపయోగించుకొని యజమానులు దారుణాలకు ఒడిగట్టడం ప్రారంభించారు. ఈ విధానంలో పని కోసం వచ్చిన వలస కార్మికులు.. యజమాని అనుమతి లేకుండా ఉద్యోగాలు మారలేరు, దేశం విడిచి వెళ్లలేరు. కనీసం బయటకు వెళ్లాలన్నా యజమాని అనుమతి తప్పనిసరి. ఈ క్రమంలో ‘కఫాలా’ (Kafala) ద్వారా ఉద్యోగాలకు వచ్చిన వారి పాస్‌పోర్టులను యజమానులు జప్తు చేసి, వేతనాలు ఆలస్యం చేసి శ్రమదోపిడీకి పాల్పడటం ప్రారంభించారు. ఈ కారణాల వల్లనే కొందరు మానవ హక్కుల కార్యకర్తలు ఈ వ్యవస్థను ‘ఆధునిక బానిసత్వం’ అని పిలిచారు.