Washington: అమెరికాకు 25 దేశాల పోస్టల్ సేవలు బంద్..

ట్రంప్ (Trump) నిర్ణయాల ప్రభావం ప్రపంచదేశాలపై పడింది. దీంతో ఆయా దేశాలు తమ ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ దశలో ట్రంప్ తీసుకున్న ఓ నిర్ణయం ఆదేశానికి పోస్టల్ సేవలు నిలిపివేసేలా చేసింది. కొత్త సుంకాల నిర్ణయంతో ఏర్పడిన గందరగోళం కారణంగా, భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా 25 దేశాలు అమెరికాకు తమ పోస్టల్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశాయి. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ పోస్టల్ యూనియన్ (యూపీయూ) ప్రకటించింది. కొత్త నిబంధనలపై స్పష్టత లేకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని యూపీయూ పేర్కొంది.
అసలు వివాదం ఏంటి?
జులై 30, 2025న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఒక కార్యనిర్వాహక ఉత్తర్వు ఈ సమస్యకు మూలకారణంగా మారింది. ఇప్పటివరకు, 800 డాలర్ల లోపు విలువైన వస్తువులను సుంకం లేకుండా అమెరికాకు పంపే అవకాశం ఉండేది. అయితే, కొత్త ఆదేశాల ప్రకారం ఆగస్టు 29 నుంచి ఈ మినహాయింపును పూర్తిగా రద్దు చేస్తున్నారు. దీంతో, అమెరికాకు వచ్చే ప్రతీ అంతర్జాతీయ పోస్టల్ వస్తువుపై కస్టమ్స్ సుంకాలు వర్తిస్తాయి. అయితే, 100 డాలర్ల లోపు విలువైన ఉత్తరాలు, డాక్యుమెంట్లు, బహుమతులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. ఈ కొత్త విధానం ఎలా అమలువుతుంది, సుంకాలను ఎలా వసూలు చేస్తారనే దానిపై అమెరికా కస్టమ్స్ శాఖ నుంచి సరైన మార్గదర్శకాలు లేకపోవడంతో అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొంది.
భారత్ కీలక నిర్ణయం
ఈ నేపథ్యంలో, భారత పోస్టల్ శాఖ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 25 నుంచి అమెరికాకు వెళ్లే అన్ని రకాల పోస్టల్ వస్తువుల బుకింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆగస్టు 23న ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. 100 డాలర్ల లోపు విలువైన డాక్యుమెంట్లు, బహుమతులను ప్రస్తుతానికి స్వీకరిస్తున్నా, వాటి రవాణాపై కూడా స్పష్టత లేదని తెలిపింది. ఇప్పటికే పార్శిళ్లు బుక్ చేసి, డెలివరీ కాని వినియోగదారులు తమ పోస్టేజీ రుసుమును తిరిగి పొందవచ్చని సూచించింది. కొత్త నిబంధనల కారణంగా విమానయాన సంస్థలు కూడా ఆగస్టు 25 తర్వాత పోస్టల్ సరుకులను స్వీకరించలేమని చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.
భారత్‌తో పాటు జర్మనీ, ఫ్రాన్స్, యూకే, ఆస్ట్రేలియా, ఇటలీ, స్వీడన్, డెన్మార్క్ వంటి అనేక కీలక దేశాలు కూడా అమెరికాకు పోస్టల్ సేవలను నిలిపివేశాయి. ఫ్రాన్స్‌కు చెందిన ‘లా పోస్ట్’, యూకేకు చెందిన ‘రాయల్ మెయిల్’ వంటి సంస్థలు కూడా కొత్త విధానాలకు అనుగుణంగా తమ సిస్టమ్‌లను మార్చుకోవడానికి అమెరికా తగిన సమయం ఇవ్వలేదని ఆరోపించాయి. ఈ నిర్ణయం వల్ల అమెరికాకు ఎగుమతులు చేసే చిన్న వ్యాపారులు, ఈ-కామర్స్ సంస్థలు, సాధారణ ప్రజలు తీవ్రంగా నష్టపోనున్నారు. ప్రస్తుతం పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, సమస్యను పరిష్కరించేందుకు అమెరికన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని భారత పోస్టల్ శాఖ అధికారులు తెలిపారు.