వైసీపీ ఎమ్మెల్యే భూమన కూ పాజిటివ్…
వారు వీరని పెద్దా చిన్నా తేడా లేకుండా వరుసపెట్టి ప్రతి ఒక్కరినీ పలకరిస్తున్న కరోనా… ఆంధ్రప్రదేశ్ లో మరో ఎమ్మెల్యేకూ సోకింది. వైసీపీ ప్రధాన నేత తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కొన్ని రోజులుగా స్వల్పలక్షణాలతో బాధపడుతున్న ఆయన మంగళవారం పరీక్షలు చేయించుకున్నారు. ఫలితాల్లో పాజిటివ్ రావడంతో ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనతో పాటు ఆయన కుమారుడు కూడా కోవిడ్ బారిన పడ్డారు. వీరిద్దరి ఆరోగ్య పరిస్థితి బాగుందని ఏ మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కుటుంబీకులు అభిమానులకు తెలిపారు.
గత కొన్ని రోజులుగా భూమన కరోనా వ్యాధిపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు పలు కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ముఖ్యంగా కరోనా సోకి మరణించినవారికి అంత్యక్రియలు చేయడానికి కూడా కుటుంబీకులు ముందుకు రాకపోవడం సరైంది కాదని అంటూ ఆయనే స్వయంగా అంత్యక్రియలు నిర్వహించి ప్రజల, మీడియా ప్రశంసలు అందుకున్నారు.






