Film Chamber: తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సంయుక్త కార్యదర్శిగా మోహన్ వడ్లపట్ల ఏకగ్రీవ ఎన్నిక
హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖ సంస్థ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో ప్రధాన పదవులకు జరిగిన తాజా ఎన్నికల్లో నిర్మాత మోహన్ వడ్లపట్ల మరోసారి కీలక బాధ్యతలు దక్కించుకున్నారు. ‘మన ప్యానల్’ నుంచి పోటీ చేసిన ఆయన, నిర్మాతల విభాగానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా గెలుపొంది, అనంతరం 2025–2027 పదవీకాలానికి సంయుక్త కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మోహన్ వడ్లపట్ల సభ్యులకు, నూతన కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని చెప్పారు. ”గత కమిటీలో దిల్ రాజు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సంయుక్త కార్యదర్శిగా పనిచేశాను, ఈ పర్యాయం దగ్గుబాటి సురేష్ బాబు అధ్యక్షుడిగా ఉన్న కమిటీలో సంయుక్త కార్యదర్శిగా పని చేయడం సంతోషంగా ఉంది.” అని మోహన్ వడ్లపట్ల తెలిపారు.
ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు, వైస్ ప్రెసిడెంట్లుగా నాగవంశీ, భరత్ చౌదరి, కార్యదర్శిగా అశోక్ కుమార్, ట్రెజరర్‌గా ముత్యాల రాందాస్ విజయం సాధించారు. ఈ నూతన కార్యవర్గం 2027 వరకు కొనసాగనుంది.

తెలుగు సినిమా నిర్మాణ, పంపిణీ, ప్రదర్శన రంగాలకు ఫిల్మ్ ఛాంబర్ కీలక దిక్సూచి సంస్థగా నిలుస్తుండగా, మోహన్ వడ్లపట్ల ఏకగ్రీవ ఎన్నికతో నిర్మాతలకు మద్దతుతో పాటు, పరిశ్రమ అభివృద్ధి దిశలో మరింత బలోపేత దిశగా అడుగులు పడనున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన అనుభవం, పరిశ్రమ పట్ల నిబద్ధత ఫిల్మ్ ఛాంబర్‌కు మరింత ఉపయోగకరంగా ఉండనుంది అని పలువురు నిర్మాతలు అభినందిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.






