తెలంగాణలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా
తెలంగాణ రాష్ట్రంలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, రామగుండం శాసనసభ్యుడు కోరుకంటి చందర్‌లకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో వారిద్దరూ హైదరాబాద్‌లో వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స నిమిత్తం చేరారు. తన తల్లి, సోదరుడు, డ్రైవర్, వ్యక్తి గత సహాయకుడికి సైతం మహమ్మారి సోకినట్లు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సింగరేణి ఇటీవల నిర్వహించిన వనమహోత్సవ్లో రామగుండం నగర మేయర్‌తో కలిసి ఎమ్మెల్యే చందర్ పాల్గొన్నారు. అనంతరం మేయర్‌కు పాజిటివ్‌గా తేలడంతో.. ఆ రోజు నుంచి ఎమ్మెల్యే హోంక్వారంటైన్లో ఉన్నారు. కరోనా పరీక్షల్లో తనకు సైతం కొవిడ్ నిర్ధారణ అయినట్లు స్వయంగా ఆయన వెల్లడించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.






