కరోనా సంక్షోభం…లాక్ డౌన్ నష్టాల నుంచి తేరుకునేందుకు…
20 లక్షల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
కరోనా వైరస్ (కోవిడ్1-9) మహమ్మారితో దేశంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల నేపథ్యంలో రూ.20 లక్షల కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. అలాగే కరోనాను ఎదుర్కొనేందుకు మే 18 నుంచి లాక్డౌన్-4 కొనసాగుతుందని తెలిపారు. జాతినుద్దేశించి మాట్లాడినప్పుడూ ఈ విషయాలు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ ‘’ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’’ పేరుతో పారిశ్రామిక రంగానికి రూ.20 లక్షల కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. ఈ ప్యాకేజీ విలువ దేశ జిడిపిలో దాదాపు 10 శాతం ఉంటుందన్నారు. ఆత్మ నిర్భర్ భారత్‌కు కావాల్సిన ఆర్ధిక దన్ను ఈ ప్యాకేజీ అందిస్తుందని, ఇది కరోనాపై పోరాటంలో ప్రతి ఒక్కరికీ చేయూతనిస్తుందని పేర్కొన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యం దిశగా కొన్ని కీలక సంస్కరణలు అత్యవసరమని, భారత ప్రభుత్వం ఇచ్చే ప్రతిపైసా లబ్దిదారులకు చేరాలని అన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఈ ఆర్థిక ప్యాకేజీ ద్వారా ఊతం అందిస్తామన్నారు. దేశంలో ప్రతి పారిశ్రామికుడిని కలుపుకొని పోయేలా ఈ ప్యాకేజీ ఉంటుందని చెప్పారు. భారత పారిశ్రామిక రంగానికి మరింత బలాన్ని చేకూర్చేలా ఇది ఉపయోగపడుతుందని అన్నారు. మేకిన్ ఇండియా కార్యక్రమానికి ప్యాకేజీ మరింత బలాన్ని చేకూరుస్తుందని తెలిపారు. 21వ శతాబ్దపు ఆక్షాంక్షలకు తగినట్లు ఈ ప్యాకేజీ రూపకల్పన, నూతన ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు దోహదం చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్లే ప్రతి రూపాయి ప్రతి శ్రామికుడు, రైతు జేబులోకి నేరుగా వెళ్తుందని అన్నారు. జన్‌ధన్ అభియాన్‌తో ఒక విప్లవాన్ని చూశామని, ఇప్పుడు మరోకొత్త విప్లవానికి నాంది పలకబోతున్నామని పేర్కొన్నారు. భవిష్యత్తులో వ్యవసాయంపై ప్రభావం పడకుండా ఏర్పాట్లు, బలమైన ఆర్థిక వ్యవస్థ నిర్మాణం, పెట్టుబడుల ఆకర్షణకు ఆలంబనగా నిలుస్తుందని తెలిపారు.
కరోనా సవాళ్లను అధిగమించాం
కరోనాతో నాలుగు నెలలకు పైగా ప్రపంచం పోరాడుతోందని, దానిపై విజయం సాధించేందుకు అందరూ కలిసి పోరాడుతున్నారని అన్నారు. ఈ వైరస్ ప్రపంచానికి తీవ్ర నష్టం కలిగించిందని, ప్రస్తుతం సంక్షోభంలో ఉందని పేర్కొన్నారు. కరోనా నుంచి మనల్ని మనం రక్షించుకుంటూ ముందుకు సాగాలని, కరోనాకు ముందు కరోనా తరువాత అని విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. భారత్‌లో కూడా అనేక మంది అయిన వారిని కోల్పోయరని, వారికి తాను సానుభూతి తెలుపుతున్నానని అన్నారు. మన పోరాట సంకల్పాన్ని మరింతగా బలపరుచుకోవాలని సూచించారు. కరోనా ఇంకా చాలాకాలం మన జీవితాల్లో ఉంటుందని ప్రధాని మోడీ అన్నారు. మాస్కులు కట్టుకుందామని, రెండడుగుల భౌతిక దూరం పాటిద్దామని పిలుపునిచ్చారు. అయితే కరోనాతో వచ్చిన సవాళ్లను మనం అధిగమించామన్నారు. ‘’ఇంత పెద్ద ఆపద భారత్‌కు ఒక సందేశాన్ని తీసుకొచ్చింది. ఒక అవసరాన్ని కూడా తీసుకొచ్చింది. ఈ సంక్షోభం ప్రారంభమయ్యేసరికి దేశంలో ఒక్క పిపిఈ కిట్ కూడా తయారు కావటం లేదు. దేశంలో ఎన్-95 మాస్కులు కూడా నామమాత్రంగా తయారయ్యేవి. ఇప్పుడు దేశంలో రెండు లక్షలపైగా పిపిఈ కిట్లు తయారయ్యాయి. ఇప్పుడు పిపిఈ కిట్లు, మాస్కులు తయారీ ద్వారా స్వయం సమ•ద్ధి సాధించాం’’ అని మోడీ అన్నారు.
ఆత్మ నిర్భర భారత్ లక్ష్యంగా భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటిస్తున్నట్లు మోదీ చెప్పారు. ఆత్మ నిర్భర్ భారత్‌కు కావాల్సిన ఆర్ధిక దన్నును ఈ ప్యాకేజీ అందిస్తుందని తెలిపారు. ఈ ఆర్ధిక ప్యాకేజీతో నిరుపేదలు, చిన్న, మధ్య తరహా పరిశ్రమల సహా ప్రతి ఒక్కరిలో భరోసానింపుతామని అన్నారు.
-దేశ స్వావలంబన.. ఇదే ‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’ లక్ష్యం
-పేదల ఖాతాల్లోకి నేరుగా జన్ ధన్ సొమ్ము
-ఎకానమీ, ఇన్ ఫాస్ట్రక్చర్, టెక్ డిఫెన్స్ సిస్టం
-ప్రొడక్షన్, ల్యాండ్, లేబర్, లిక్విడిటీ, లా
-లోకల్ భ్రాండ్లను అంతర్జాతీయం చేయడం
-గ్లోబల్ వ్యాల్యూ చైన్ ఇంటిగ్రేషన్
ఆత్మ నిర్భర్ భారత్ అంటే స్వయం ఆధారిత భారత్ అని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి శ్రీమతి నిర్మలాసీతారామన్ వివరించారు. ఐదు మూల స్తంభాల ఆధారంగా ఈ ప్యాకేజీని రూపొందించినట్టు ఆమె చెప్పారు. ఆత్మ నిర్భర్ అనే పదానికి నాలుగు దక్షిణాది భాషల్లో ఆమె అర్థం చెప్పారు. స్థానిక ఉత్పతులకు ప్రాధాన్యమిస్తూ లోకల్ బ్రాండ్లను విశ్వవ్యాప్తం చేయడం, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు 3 లక్షల కోట్ల ఆర్ధిక సాయం ఆమె పేర్కొన్న అంశాల్లో ప్రధానంగా ఉన్నాయి. దీనివల్ల 45 లక్షల పరిశ్రమలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. ఏడాది కాల మారటోరియంతో నాలుగేళ్లలో ఈ రుణం అందుతుందన్నారు. వీటికి 100 శాతం క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ వర్తిస్తుందన్నారు. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్, ఈజ్ ఆఫ్ కాంప్లియెన్స్’ అన్నవి ప్రభుత్వ ధ్యేయాలని చెప్పిన ఆమె.. జన్ ధన్ యోజన, పీఎం ఆవాస్ యోజన, స్వచ్ఛభారత్ అభియాన్, పీఎం పసల్ బీమా యోజన, పీఎం కిసాన్ యోజన వంటి పథకాల వల్ల పేదలకు ప్రయోజనం కలుగుతోందన్నారు. ఉజ్వల పథకాన్ని ప్రస్తావిస్తూ.. ఈ పథకం వల్ల పేదలకు ఉచిత వంట గ్యాస్ లభించిందని చెప్పారు.






