ఒకే రోజు 52 వేల కేసులు
భారతదేశంలో కరోనా కొత్త రికార్డులను నమోదు చేస్తోంది. గురువారం ఒక్క రోజే ఏకంగా 52 వేలకు పైగా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 15,83,792కు చేరుకుంది. ఇందులో 10 లక్షల మందికి పైగా కోలుకోగా 5,28,242 యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 24 గంటల్లో 52,123 కొత్త కేసులు వచ్చాయని, 775 మంది మరణించారని వెల్లడించింది. కోలుకునే వారి రేటు 64.44గా ఉండగా, మరణాల రేటు 2.21గా ఉంది. జులై 29 వరకు 1,81,90,382 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ చెప్పింది. బుధవారం మరో 4,46,642 కేసులను పరీక్షిస్తున్నట్లు పేర్కొంది. దేశంలో ప్రస్తుతం రోజుకు 5 లక్షల కరోనా పరీక్షలు జరుగుతున్నాయని, రానున్న రెండు నెల్లలో ఆ సంఖ్యను 10 లక్షలకు పెంచాలని భావిస్తున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ తెలిపారు.






