మనుషులకు కాస్త దూరంగా మాస్క్ కు బాగా దగ్గరగా.. కరోనాపై నిపుణుల విశ్లేషణ
వ్యాక్సిన్ వచ్చేంత వరకు కరోనాతో కలిసి జీవించక తప్పదు. ఈ విషయం అందరికీ అర్ధమయ్యింది దీనితో ప్రభుత్వాలు జాగ్రత్తలు పాటిస్తూనే ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. మెల్లమెల్లగా ఆంక్షలను సడలిస్తున్నాయి. ఒకవైపు ప్రజలు, ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. దీనిలో భాగంగానే లాక్డౌన్ 4.0 చాలా భిన్నంగా ఉండబోతోందని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. భిన్నమంటే ? ఆంక్షలను మరింత సడలిస్తారా? ప్రజా రవాణా మొదలవుతుందా? అంతర్ రాష్ట్ర ప్రయాణాలకు అనుమతి ఇస్తారా? అన్ని దుకాణాలు తెరవొచ్చా? అనే సందేహాలు ఎలా ఉన్నా…సాధారణ జీవితాన్ని పునరుద్ధరించే దిశగా మరింత వేగంగా అడుగులు పడబోతున్నాయనేది మాత్రం సుస్పష్టం.
జాగ్రత్తలెలా…
దేశంలో వైరస్ ప్రభావమైతే తగ్గలేదు. అంతకంతకూ ప్రబలుతూనే ఉంది మరలాంటప్పుడు ఆంక్షలు సడలిస్తే పరిస్థితి ఏమిటి? మనం బయటకు వెళితే కరోనా రాదా? 100 మంది మన పక్కనుంచే వెళ్తే భౌతిక దూరం పనిచేస్తుందా? జనాలు కిటకిటలాడే సూపర్ మార్కెట్లలో మాస్క్లు ధరిస్తే చాలా? మనిషికి మనిషికి మధ్య నిర్దుష్టంగా ఎంత దూరం ఉండాలి?
ఇంట్లో క్వారంటైన్లో ఉన్నప్పుడు ఇతరులను కలిసేందుకు వీలవ్వదు. భౌతిక దూరం, ఆరడుగుల దూరం పాటించేందుకు కుదురుతుంది అయితే బయటకు వెళ్ళినప్పుడు మన పక్క నుంచి నాలుగు అడుగుల దూరంలోనే మరొకరు వెళ్తే ఏంటి? వైరస్ రిస్క్ ఎంత ఉంటుంది? ఒక భారీ సూపర్ మార్కెట్, పక్కనే కిరణా షాపులో ఏది ప్రమాదకరం? మాస్క్ వేసుకున్నప్పుడు ప్రమాదతీవ్రతలో మార్పు ఉంటుందా? వైరస్ ఉన్న ఒక ఉపరితలం ముట్టుకొని ముఖాన్ని స్పర్శిస్తే? ఒక కొవిడ్ రోగి మీ పక్కనుంచి వెళ్తూన్నపుడు తుంపర్ల విస్తరణ ఎలా ఉంటుంది? సాధారణ ప్రజల్లో సందేహాలెన్నో…
ఎంఐటీలో అంటువ్యాధుల వ్యాప్తి పరిశోధనలో పాలుపంచుకున్న ఎలీనా పొలొజొవో గాల్లోని అణువుల ఫ్లూయిడ్ డైనమిక్స్ తీసుకొని పెద్ద, చిన్న గదుల్లో పరిస్థితులను విశ్లేషించారు..ఓ గణాంక మోడల్ ద్వారా ప్రజలకు ఉపయుక్తమైన విశ్లేషణలు చేస్తున్నారిలా…
మీరున్న ప్రాంతంలో వైరస్ తీవ్రత రెండు రెట్లు ఉంటే మీరు బయటకు వెళ్లినప్పుడు ఉండే రిస్క్ రెండు రెట్లని ఎలీనా అంటున్నారు. మీరు నడుస్తున్నప్పుడు పక్కనే నడిచే జనాలు సగం మంది తగ్గితే సగం ప్రమాదం తగ్గినట్టే. ఉపరితలాలను ఎక్కువ సార్లు శానిటైజ్ చేస్తే రిస్క్ ఇంకా తగ్గుతుంది. సర్జికల్ మాస్క్ ద్వారా 90 శాతం వైరల్ పదార్థాలను నివారించొచ్చు. ఇది 10 రెట్లు రక్షణ కారకం అవుతుంది. అదే టీషర్ట్ మాస్కైతే 70% పదార్థాలను తగ్గిస్తుంది. ఆరడుగులు/రెండు గజాల దూరం ఎప్పటికీ సురక్షితంగా ఉంచుతుంది. మీరు నడుస్తున్నప్పుడు పక్కన వెళ్లేవారు 4 అడుగుల దూరంలో ఉంటే తీవ్రత ఎక్కువ. అలా ఎందరు వెళ్తే అంత ప్రమాదం ఉంటుంది. అదే మాస్క్ వేసుకొని అందరూ వెళ్తే భద్రత ఎక్కువ.
మన పక్కనున్న వారు ఎన్నిసార్లు శ్వాస తీసుకుంటారన్న అంశంపై కూడా ప్రమాదం తీవ్రత ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు అవతలి వారు రెండుసార్లు శ్వాస తీసుకుంటారని అనుకుంటే 10, 30, 100.. ఎంత మంది మన పక్కనుంచి వెళ్తే అంత ప్రమాదం అన్నమాట. ఆరు కన్నా నాలుగు అడుగుల దూరంలోని వారు మాస్క్ లేకుండా దగ్గినా, తుమ్మినా రిస్క్ ఎక్కువ. అంటే 4 అడుగుల దూరంలో 100 మంది వెళ్తే అందరూ దగ్గితే కొవిడ్ సోకే అవకాశం 19% ఉంటుంది. అదే 6 అడుగులైతే ఇది 0.8 శాతానికి పడిపోతుంది. అంటే ఆరడుగులు, మాస్క్ ఇచ్చే రక్షణ ఎంత ఎక్కువో అర్థం చేసుకోవచ్చు.
ఆరునూరైనా…ఆరడుగుల దూరం…
ఇతరులతో సమావేశమైనప్పుడు అవతలి వారి శ్వాసను దగ్గినట్టుగా పరిగణించి లేదా కేవలం మాట్లాడితే కరోనా సోకే అవకాశం ఎంత ఉంటుందో లెక్కిస్తే…ఒక మనిషి నిమిషానికి 16 సార్లు శ్వాస తీసుకుంటాడని ఎలీనా అంచనా వేసింది. 100 మంది మాస్కుల్లేకుండా అదే పనిగా దగ్గుతున్నారనుకుందాం. అప్పుడు 15 నిమిషాలతో పోలిస్తే గంట తర్వాత ప్రమాదం తీవ్రత 3 రెట్లు ఎక్కువ ఉంటుంది. అందుకే ఎంత తక్కువ సమయం కలిస్తే అంత మంచిది. అదే ఆరడుగల దూరం ఉండి మాస్క్ ధరించి దగ్గకుండా మాట్లాడితే 30 సెకన్లు అయినా 3 గంటలైనా రక్షణ ఒకేలా ఉంటుంది.
షాపులెలా సురక్షితం?
ఎందరు వస్తున్నారు? ఎన్ని వస్తువులను ముట్టుకుంటున్నారు? మాస్క్ ధరించారా లేదా? తరచూ శానిటైజ్ చేశారా అన్న అంశాలపై ఆధారపడి చిన్న కిరాణం లేదా సూపర్ బజార్లో ఏది సురక్షితమో చెప్పొచ్చని ఎలీనా అంటోంది. భౌతిక దూరం పాటించకుండా ఎక్కువ మంది మధ్యలో ఉంటే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఒంట్లో బాగాలేని వారు ముట్టుకున్నా, దగ్గినా తీవ్రత ఎక్కువే. ఎలా చూసినా పెద్ద స్టోర్లకే జనం ఎక్కువ వెళ్తారు కాబట్టి రిస్క్ ఎక్కువ. అయితే శానిటైజ్తో ఆ ప్రమాదం తగ్గించొచ్చు. ఈ గణాంక మోడల్లో కొన్ని సహేతుకంగా అనిపించకపోవచ్చని ఎలీనా తెలిపింది. అయితే బయటకు వెళ్లినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది ప్రజలకు తెలియాలి. అందుకు ఈ మోడల్ ఉపయోగపడుతుందని ఆమె ఉద్దేశం. ఏ విధంగా చూసినా ఆరడుగుల దూరం, మాస్క్ లతో చాలా వరకూ కరోనా నుంచి కాపాడుకోవచ్చునని ఈమె అంటున్నారు.






