కొత్త రకం కరోనా వైరస్ కు ఆరువారాల్లో వ్యాక్సిన్!

జర్మనీకి చెందిన ప్రముఖ ఫార్మా దిగ్గజం బయోఎన్ టెక్ కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆరు వారాల్లో కొవిడ్-19 స్ట్రెయిన్‌కు టీకా తయారు చేయగలమని ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఉగుర్ సాహిన్ పేర్కొన్నారు. కొత్తరకం స్ట్రెయిన్ మీద కొవిడ్-19 టీకా సమర్థంగానే పనిచేస్తుంది. ఒకవేళ అవసరమైతే ఈ రకం వైరస్‌పై నేరుగా ప్రయోగాలు ప్రారంభిస్తాం. ఆరు వారాల్లో కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్‌కు బయోఎన్‌టెక్ టీకాను అందుబాటులోకి తీసుకురాగలదు అని చెప్పారు.
యూకేలో కొత్తరకం కరోనా వైరస్ స్ట్రెయిన్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలు దేశాలు యూకే విమానాలపై ఆంక్షలు విధించాయి. భారత్ కూడా అప్రమత్తమై ఆయా దేశాల విమానాలను తాత్కాలికంగా నిషేధిస్తూ నిర్ణయించింది. అంతేకాకుండా బ్రిటన్ నుంచి వచ్చే వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు, ఐసోలేషన్ ఏర్పాట్లకు సమాయాత్తం చేసింది. మరోవైపు కొవిడ్-19కు సంబంధించి ఇప్పటికే ఫైజర్, బయోఎన్‌టెక్ సంస్థలు రూపొందించిన ఫైజర్ టీకాను అత్యవసరంగా ఉపయోగించేందుకు పలు దేశాలు అనుమతి ఇచ్చాయి.