కోవిడ్ మృతునికి అంత్యక్రియలు జరిపించిన ఎమ్మెల్యే
కరోనా మహమ్మారి ప్రాణాలను తీయడంతో పాటు ప్రజలను అనేకానేక భయందోళనలకూ గురి చేస్తోంది. దీని చుట్టూ అల్లుకున్న అపోహలు మరిన్ని సమస్యలకు కారణమవుతున్నాయి. కరోనాపై పోరాటంలో ప్రభుత్వాలకు తలనొప్పులు పెంచుతున్నాయి. ఇప్పటికే కరోనా వ్యాప్తితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి తోడు అపోహల కారణంగా కరోనా మృతులకు అంత్యక్రియలు జరిపే విషయంలో ప్రజల సహకారం కొరవడడంతో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కుంటోంది. ఈ పరిస్థితిని అధిగమించడానికి కరోనాతో మృతి చెందిన వారి అంత్యక్రియల కోసం రూ.15వేలు అందజేస్తామని కూడా వైసీపీ సర్కార్ ప్రకటించింది. అయినప్పటికీ పలు గ్రామాల్లో ప్రజలు అంత్యక్రియలకు అడ్గుకుంటున్నారు.
ఈ నేపధ్యంలో తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ఈ విషయంపై ప్రజలకు అవగాహన కలిగించాలనుకున్నారు. దీని కోసం ఊరికే అందరిలా మాటలు చెప్పి ఊరుకోకుండా కరోనాతో్ మృతి చెందిన వ్యక్తికి దగ్గరుండి అంత్యక్రియలు జరిపించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి మునిసిపల్ కమిషనర్ గిరీష తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ కరోనాతో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు సైతం రాకపోవడం బాధాకరమన్నారు. కరోనాతో మృతి చెందిన వ్యక్తి శరీరంపై వైరస్ అవశేషాలు 6గంటలకు మించి ఉండవన్నారు. ఈ అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించడానికే ఈ అంత్యక్రియలు జరిపించానన్నారు.






