కరోనా…ఆయుర్వేదం ఏం చెప్తోంది?
కళారత్న డా జి. వి. పూర్ణచందు, B.A.M.S.,
సాహితీవేత్త, ప్రముఖ ఆయుర్వేద వైద్యులు, సెల్: 9440172642
‘కరో’ అంటే, చెయ్యటం, ‘న’ అంటే వద్దు అని!
‘‘ఇలా చెయ్యవద్దు’’ అని కరోనా చెప్తోంది. చేస్తే వస్తానని హెచ్చరిస్తోంది!
భయోనా అంటే భయం వద్దని! కరోనాకి మందు భయోనాయే! భయం వదిలి కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!
ఆయుర్వేదంలో ఇమ్యూనిటీ
శరీరం శత్రుదుర్భేద్యమైన ఒక కంచుకోట! అందులోకి వైరస్ వంటి శత్రువులు ప్రవేశించి దాడికి దిగితే, వెంటనే ‘వ్యాధిక్షమత’ అనే ‘వ్యాధి నిరోధక రక్షణయంత్రాంగం దానిపైన ఎదురుదాడి చేస్తుంది. శరీరం గెలిచిందా రోగం తిరోగమిస్తుంది. శరీరం బలహీనమైతే జబ్బుకి లొంగిపోతుంది. ఆధునిక ఉపకరణాలు ఏవీ లేని ఆ రోజుల్లో 2000 యేళ్ల క్రితమే చరకసంహిత ఈ విషయాన్ని చెప్పింది.
ఒక మహమ్మారి(పెండమిక్) లోకాన్నంతా చుట్టబెడ్తుంటే, ఔషధ చికిత్స ఏదీ అందుబాటులో లేనప్పుడు, అటు ఆరోగ్యవంతుల లోనూ ఇటు అంటువ్యాధుల బాధితుల్లోనూ ‘వ్యాధిక్షమత’ పెరిగేలా చూడాలంటాడు చరకుడు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిందీ ఇదే!
శరీరధాతువులకు వ్యతిరేక లక్షణాలు కలిగి ఉంటాయి కాబట్టి, వైరసులవంటి జీవుల్ని ‘దేహధాతు ప్రత్యానికభూతాలు’ అన్నారు. అవి శరీరంలోకి ప్రవేశించగానే దేహధాతువులు వాటికి వ్యతిరేకంగా పోరాడతాయి. ఈ పోరాటంలో ‘వ్యాధిక్షమత్వం’(ఇమ్యూనిటి) బలంగా ఉంటే గెలుపు దేహానిదే అవుతుందని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది.
సామాజిక అధర్మాలు కారణం
సమాజధర్మాన్ని వ్యక్తులు నెరవేర్చకపోవడంవలన అనేక మహమ్మారులు వస్తున్నాయంటాడు చరకుడు. ఆయుర్వేదంలో ఈ మహమ్మారుల్ని ‘‘జనపదోధ్వంస వ్యాధు’లని పేర్కొన్నారు. శిష్యుడైన అగ్నివేశుడు వీటికి ‘‘కుతో మూలం..?( ఏది మూలకారణం?) అనడిగితే, గురువు ఆత్రేయుడు ‘‘తస్యమూల మధర్మః(దానికి మూల కారణం అధర్మం) అని జవాబిచ్చాడని చరకసంహిత వివరించింది.
ప్రకృతిని సర్వనాశనం చేసి, జీవవైవిధ్యాన్ని దెబ్బతీసి, పంచభూతాల్ని కలుషితం చేసి, సామాజిక ధర్మాలను విస్మరిస్తున్నాడు మనిషి. వ్యక్తిగత ఆరోగ్యసూత్రాలంటే నిర్లక్ష్యం పెరిగింది. అపరిశుభ్ర ఆహార పానీయాలు, అసహజమైన ఆహారపు అలవాట్లు, అనారోగ్యకర జీవనవిధానాలు ఇవన్నీ సామాజిక అధర్మాలే! వీటివలనే జనపదోధ్వంస వ్యాధులు ప్రబలుతాయని చరకుడి భాష్యం.
కరోనా తాళం పడ్డాక కూడా ముఖపట్టీలు(మాస్కులు)తొడుక్కోకపోవటం, సామాజిక ఎడం పాటించక పోవటం, మురుక్కాలవల మీద వండినవి ఎగబడి తినటం, ఇవన్నీ మన దేశంలో కరోనా రోగుల సంఖ్య లక్షల్లో పెరగడానికి కారణాలు. జన అపరాధమే ఇంత వ్యాప్తికి కారణం. కానీ, బలి అవుతోంది సంబంధం లేని అమాయకులు కదా!
రాక్షసులు కాదు మనుషులే కారకులు
‘‘నైవదేవా న గంధర్వ న పిశాచా న రాక్షసాః•న చాన్యే స్వయమక్లిష్టముపక్లిశ్నంతి మానవమ్’’ సామాజిక ధర్మాన్ని పాటించే వ్యక్తుల్ని దేవతలు కానీ, గంధర్వులు కానీ, పిశాచాలు కానీ, రాక్షసులు కానీ ఏమీ చేయలేరు. మానవ సహజధర్మాల్ని సక్రమంగా పాటించని వ్యక్తి తన విధానాలకు తానే బాధ్యుడు, తానే బాధితుడు అవుతాడు. ఏ దేవతో, రాక్షసుడో బాధ్యుడు కాదంటాడు చరకుడు.
తమ సుఖదుఃఖాలకు ప్రతి ఒక్కరూ తమనే బాధ్యుల్ని చేసుకోవాలి. సమాజ శ్రేయోమార్గాన్ని అనుసరించాలి. అన్నీ తెలిసుండే అధర్మాన్ని ఆచరించటాన్ని ‘ప్రజ్ఞాపరాధం’ అన్నారు. మద్యపానం, పొగత్రాగటం ఇవన్నీ అనారోగ్య కారకాలని తెలిసే జనం తాగుతున్నారు. అవి వాళ్ల వ్యక్తిగత విషయాలు ఎంతమాత్రమూ కావు. ఒక వ్యక్తి పొగతాగితే చుట్టూ ఉన్న పదిమందికి కేన్సరు వస్తోంది. ఒక తాగుబోతు వల్ల కుటుంబంలోని అందరికీ చేటు కలుగుతోంది. సామాజిక అధర్మం అంటే ఇది! ఎక్కడో చైనాలో గబ్బిళాలు, సర్పాలు తింటే ఇక్కడ మనం గంటకొకసారి చేతులు కడుక్కుంటున్నామంటే కొందరు చేసే ప్రజ్ఞాపరాధాలు లోకాస్సమస్తాన్నీముంచుతాయి.
రోగి బలం పెరగాలి…
రోగ బలం తగ్గాలంటే, రోగి బలం (ఇమ్యూనిటీ) పెరగాలి. అతి సూక్ష్మజీవుల వల్ల వచ్చే కరోనా, ఎబోలా, స్వైన్‌ఫ్లూ లాంటి వ్యాధుల్లోనే కాదు, కేన్సరు, అలర్జీలు ఇతర ఆటో ఇమ్యూన్ వ్యాధుల వల్ల కూడా ఇమ్యూనిటీ దెబ్బ తింటుంది. దాన్ని పటిష్టపరచి, ఆరోగ్యవంతుడి ఆరోగ్యం కాపాడటం, అనారోగ్యాన్ని తగ్గించటం ఆయుర్వేద లక్ష్యం.
వ్యాధిక్షమత్వం (రోగి బలం) పెరిగితే ‘వ్యాధి బల విరోధిత్వం’ (రోగ బలం తగ్గించడం), తద్వారా ‘వ్యాధి ఉత్పాద ప్రతిబంధకత’ (వ్యాధి ఏర్పడే కారణాలను నిలువరించడం) సాధ్యపడతాయి. హితకరాలు (పోషకాలున్నవి) తినేవారికి, అహితకరాలు(హానిచేసేవి) మానినవారికి, వ్యాధిక్షమత్వం(ఇమ్యూనిటీ) పెరుగుతుంది! ‘అతి స్థూలురు (ఊబకాయం), క•శించిన వారు (బలహీనులు), రక్త, మాంస, అస్థి ధాతువులు సమస్థితిలో లేని వారు (అనవస్థిత మాంసశోణిత అస్థీనీ), దుర్బలురు, అనారోగ్యకర (జంక్‌ఫుడ్) తిండి తినేవాళ్లు (అసాత్మ్య ఆహారసేవి), పోషకాహారం చాలినంత తీసుకోనివాళ్లు, జఠరాగ్ని మందగించిన వాళ్లకు’ వ్యాధిక్షమత్వం’ తక్కువగా ఉంటుంది.
శరీర బలం, జఠరాగ్ని, ఇమ్యూనిటీ పెరిగేలా వేళకు భోజనం, నిద్ర, నియమబద్ధ జీవన విధానం ముఖ్యం. జఠరాగ్ని మందగిస్తే ఎంత గొప్ప ఔషధం ఇచ్చినా వంటబట్టదు. అందుకని ప్రయత్న పూర్వకంగా జీర్ణశక్తిని కాపాడుకోవాలనేది ఆయుర్వేద ప్రధాన సూత్రం.
అంటుకుంటే అంటేది అంటువ్యాధి!
‘‘ప్రసంగాత్ గాత్రసంస్పర్శాత్ నిశ్వాసా త్సహభోజనాత్•సహశయ్యాసనాచ్చపి వస్త్ర మాల్యానులేపనాత్’’ సంసర్గం (ఒకరినొకరు తాకటం) వలన సోకే వ్యాధులు కాబట్టి వీటిని ఔపసర్గిక వ్యాధులు అన్నారు. అవి వచ్చే తీరుని ఈ సూత్రంలో వివరించాడు సుశ్రుతుడు.
ప్రసంగం(కలిసి కూర్చుని మాట్లాడటం),గాత్ర సంస్పర్శనం (కరచాలనాలు, కావులింతలు, భౌతిక స్పర్శలు), నిశ్వాసం(ఒకళ్లు వదిలిన గాలి ఇంకొకళ్లు పీల్చటం), సహభోజనం(ఒకే పళ్లెంలో కలిసి తినటం), సహశయ్య(ఒకే పక్కమీద కలిసి పడుకోవటం) సహ ఆసనాత్(ఒకే ఆసనం మీద ఇద్దరు ఇరికి కూర్చోవటం) ఇంకా… బట్టలు, పౌడర్లు, క్రీములు వగైరా ఒకరివి ఒకరు వాడుకోవటం ఇలాంటి వన్నీ వివిధ అంటువ్యాధులు ప్రబలటానికి కారణాలంటాడు. అపవిత్రత (వ్యక్తిగత అపరిశుభ్రత)ముఖ్యకారణంగా కనిస్తుంది ఈ వ్యాధుల్లో!
మనుషులంతా ఒకే తీరులో ఉండరు. ఎవరి శరీర ప్రకృతులు వాళ్లవి, ఎవరి జీవన విధానం వాళ్లది, ఎవరి తిండీ తిప్పలు, ఎవరి ఆహారపు అలవాట్లు వాళ్లవి. ఎవరి దేహ నిర్మాణం వారిది. ఎవరి శరీర బలం వాళ్లది. ఒకరికి సరిపడినవి వేరొకరికి సరిపడకపోవచ్చు. ఒకరు బాగా తట్టుకోగలిగి ఉంటారు. ఒకరు చిన్నదానికే ఎక్కువ అల్లల్లాడిపోతారు. ఒకరు పిల్లవాడుగా ఉంటే ఒకరు మధ్యవయస్కుడు, ఇంకొకరు వయోవ•ద్ధుడుగా ఉంటారు. కొందరు స్త్రీలుంటారు. కొందరు పురుషులుంటారు. ఇలా ఎవరికి వాళ్లుగా ఉన్నప్పుడు, ఒకే వ్యాధి అందరికీ సమానంగా ఒకే తీరులో ఎలా వస్తుంది? అని ప్రశ్నించి సమాధానం చెప్తోన్నాడు శాస్త్రకారుడు:
వాయు కాలుష్యం, జల కాలుష్యం, ధ్వనికాలుష్యం, ఋతుకాలుష్యం(కాలకాలుష్యం) వీటివలన ప్రకృతి తన సహజ గుణాలను, కోల్పోతుంది. వికృతి చెందిన గాలి, నేల, నీరు, వాతావరణం, కాలం ఇవన్నీ వయోపరిమితులతో నిమిత్తం లేకుండా మనుషులందరికీ మూకుమ్మడిగా జనపదోధ్వంసవ్యాధులను కలిగిస్తాయి.
ఇవి వచ్చినప్పుడు నిజాయితీగా, దయాగుణంతో, దానగుణంతో, మంచి నడవడికతో సామాజికంగా జీవించాలన్నాడు. ఊరుకు మేలు చేసే మంగళప్రదమైనవి మాత్రమే చెయ్యాలి. మనిషిగా తన ధర్మాన్ని ఆచరణలోకి తేవాలి. అందువలన ‘‘ఆయుఃపరిపాలన’’ జరుగు తుందన్నాడు. అధర్మం, అపవిత్రత, అనాచారాల వలనే అంటువ్యాధు లొస్తున్నాయన్నాడు చరకుడు.
ఆరురుచుల అన్నమే ఔషధం
‘‘షడ్రసోపేత భోజనం’’ అంటాం మనం. సమతుల్య ఆహారాన్ని(బ్యాలెన్సడ్ డైట్) ఆయుర్వేదంలో ఇలా పిలుస్తారు. ఆధునిక వైద్య శాస్త్రంలో పోషకాలను విటమిన్లు, ప్రోటీన్లు, మినరల్సు ఇలా కొలుస్తారు. ఆయుర్వేద శాస్త్రం పోషకాలను ఆరు రుచులతో కొలుస్తుంది.
జీవితం నవరసాలతో రసవత్తరం కావాలంటే భోజనం షడ్రసాలతో రసమయంగా ఉండాలి. తీపి, పులుపు, ఉప్పు, వగరు, కారం, చేదు ఈ ఆరు రుచులు భోజనంలో తగుపాళ్లలో ఉంటే అది పోషకాహారమే! తీపి, పులుపు, ఉప్పు, కారాలు బాగానే తింటున్నాం కానీ, చేదు వగరుల్ని చాలా తక్కువగా తింటున్నాం. వైరస్ వ్యాధులకు తీపి అనుకూలంగానూ, చేదు విరోధిగానూ పనిచేస్తుంది. అందుకని ఇమ్యూనిటీ పెరగా లంటే, తీపి తక్కువగా, చేదు ఎక్కువగా తినాలి. తీపి, పులుపుల్తోపాటు వగరూ చేదుల్ని కూడా తినాలని ఉగాదిపచ్చడి చాటిచెప్తోంది. వేప్పువ్వు తేలికగా దొరికేదే! ఏడాది పొడవునా దాన్ని తింటూంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది.
ఆచార రసాయనం
కరోనా నివారణకు ‘ఆచార రసాయనం’ గొప్ప ఔషధం! రసం అంటే పోషకత్వం కలిగిన సారవంతమైన బాగం.అయనం అంటే ప్రయాణం. పోషకాలు శరీరం అంతా వ్యాపించటం అని! అలా చేసే ఆచారాలను ఆచార రసాయనం అన్నారు.
‘‘యుక్తాహార విహారస్య యుక్తా చేష్టస్య కర్మసుఖయుక్తా స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖం’’ మేలుచేసే ఆహార విహారాలు తీసుకుంటూ, ఇతరులకు మేలు కలిగేలా ప్రవర్తిస్తూ, నిద్రాహార విధుల్ని పాటించేవాడికి దుఃఖం కలగదు. దుఃఖాలను బాపుకునే యోగం కలగాలంటే అందుకు అర్హులం కావాంటుంది భగవద్గీత. ఎంత అర్హత కలిగి ఉంటే, అంత సురక్షితంగా ఉంటారు.
రోగనిరోధకశక్తి రాత్రికి రాత్రి పుట్టుకు రాదు. డబ్బుతో కొండమీద కోతిని కొని తేగలరేమో కానీ, ఇమ్యూనిటీని కొనలేరు.
అంతరిక్షాన్ని జయించిన మనిషికి శుచి, శుభ్రత నేర్పవలసి వస్తోందంటే ఇన్నాళ్లూ పురోగమించామా? తిరోగమించామా?చేతులు ఎలా కడుక్కోవాలో, ముక్కు ఎలా తుడుచుకోవాలో సినీ నటులు చూపిస్తే తప్ప కదలని జడత్వం ఎందుకు ఆవహించిందీ మనల్ని…?
ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి. ఎంతటి వారికైనా కరోనా రావచ్చు. నాకు రాదనే ధీమా ఎవరికీ మంచిది కాదు. ఒకవేళ వ్యాధి సోకినా శరీరం దాన్ని ఎదుర్కొని ఎలాంటి లక్షణాలూ కలక్కుండా నెగెటివ్ వచ్చే పరిస్థితి ఉండాలి. భారతీయుల్లో కరోనామరణాలు1.5% కంటే తక్కువగా ఉన్నాయంటే, సంస్క•తీ సంపన్నమైన సాంప్రదాయక జీవనవిధానం మన ఇమ్యూనిటీని కాపాడుతోందన్నమాట. సామాజిక ధర్మాలను పాటిస్తే, వ్యాధి ఆగిపోయే అవకాశం ఉంది.
మన వంటిల్లే మనకు తగిన రక్ష…ఈ వ్యాసం గత సంచికలో ప్రచురించడం జరిగింది. ఆ ఆర్టికల్ కోసం ఈ లింక్‌ను చూడండి.
https://www.telugutimes.net/epapers/2020/July/111






