ఢిల్లీ సిఎంకి కరోనా? ఢిల్లీలో లక్షకు చేరనున్న కేసుల సంఖ్య…
గత కొన్ని రోజులుగా దేశంలోని సామాన్యులకు మాత్రమే కాకుండా ప్రముఖులను కూడా వదలకుండా కమ్మేస్తున్న కరోనా… ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మీదా ప్రతాపం చూపిందా? ఈ ప్రశ్నకు సమాధానం రేపు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం తీవ్రమైన జలుబు, జ్వరం, దగ్గుతో్ బాధపడుతున్న కేజ్రీవాల్ స్వీయనిర్భంధంలోకి వెళ్లారు. ఆయనకు మంగళవారం వైద్యులు కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. వీటి ఫలితాలు బుధవారం వెల్లడికావచ్చునని అంటున్నారు. మరోవైపు ఢిల్లీలో కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. మంగళవారం నాటికి 26వేల మార్కును దాటిన కేసుల సంఖ్య… ఈ నెలాఖరుకి లక్షకు చేరవచ్చునని సాక్షాత్తూ ఢిల్లీ ప్రభుత్వం నియమించిన కమిటీ అంచనా వేయడంతో ఢిల్లీ వాసుల్లో ఆందోళన పెరిగింది. మరోవైపు పలు రకాల కారణాలతో ఢిల్లీలో నివసిస్తున్న వేర్వేరు ప్రాంతాల వారు ఢిల్లీని వదిలిపెట్టడానికి సమాయత్తమవుతున్నారని సమాచారం.
తాము ముంబయి, అహ్మదాబాద్, చెన్నై నగరాలలో పెరుగుదలను పరిశీలించిన తర్వాతే ఢిల్లీ విషయంలో అంచనాకు వచ్చామని కమిటీ ఛైర్మన్ మహేష్ వర్మ అంటున్నారు. తమ పరిశీలన ప్రకారం ఢిల్లీ ఈ నెలాఖరుకు లక్ష కేసుల సంఖ్యను దాటుతుందని, ఇందుకు అనుగుణంగా ఇప్పుడున్న దానికి అదనంగా మరో 15వేల బెడ్స్ ఏర్పాటు చేయాలని తాము ప్రభుత్వానికి సూచించామన్నారు. అత్యధిక శాతం రోగులు హైపోక్సియా అనే పరిస్థితికి గురవుతున్నారని, వీరిలో 5శాతం మందికి వెంటిలేటర్ చికిత్స అవసంరం అవుతుంది కాబట్టి నాణ్యమైన ఆక్సిజన్ అందుబాటులో ఉంచాలని తాము ప్రతిపాదించామన్నారు.






