పాప్యులారిటీలో ప్రపంచంలోనే నెంబర్ 1 మోడీ
–కోవిడ్ విపత్తును సమర్ధంగా ఎదుర్కున్నారంటూ ప్రశంసలు
–పలు సర్వేల్లో మోడీ కరోనా మేనేజ్మెంట్కు అనుకూలంగా ప్రజా మద్ధతు
భారతదేశంలో ఏ పార్టీ ఎలా భావిస్తున్నా…ప్రపంచవ్యాప్తంగా మాత్రం పాప్యులారిటీలో మోడీ నెంబర్ వన్‌గా నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్–19 నేపధ్యంలో సమర్ధమైన నిర్ణయాలు, కరోనా కట్టడి వంటి అంశాల ఆధారంగా నేతల పాప్యులారిటీ గురించి అమెరికన్ పోలింగ్ కంపెకనీ మార్నింగ్ కన్సల్ట్ తాజా ఫలితాలను విడుదల చేసింది. ఈ జాబితాలో భారత దేశ ప్రధాని నరేంద్రమోడీ అగ్రస్థానం దక్కించుకున్నారు. గతానికి మించి ఘనంగా…
గత జనవరి 7 నుంచి మే 19 దాకా రోజుకు సగటున నిర్వహించిన 3వేల ఆన్లైన్ ఇంటర్వ్యూల ద్వారా వెల్లడైన ఫలితాల్లో… మోడీకి మద్ధతు కొన్ని రోజుల్లోనే 76శాతం నుంచి 82శాతానికి పెరిగింది. మార్నింగ్ కన్సల్ట్ సంస్థ దీనిని ఒక గ్రాఫ్ ఆధారంగా తెలియజేసింది. ఆసక్తికరంగా మోడీ గ్రాఫ్ మార్చి 17 కు ముందు అనేక ఒడిదుడుకులకు లోనైంది. అయితే ఆ తర్వాత అంటే జాతీయ స్థాయి లాక్ డవున్ ప్రకటించిన తర్వాతి రోజు నుంచి మోడీ పాప్యులారిటీ స్థిరంగా పెరుగుతూ వచ్చింది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యలో గాని, మరణాల రేటులో గాని భారత్ మిగిలిన ప్రపంచం కంటే మెరుగ్గా ఉండడం కూడా ఇప్పటిదాకా భారత్ సరైన బాటలోనే ఉందనే సంకేతాలు ఇస్తోంది. పాప్యులారిటీకి అర్హులే…
ప్రధాని మోడీ కోవిడ్‌ను చాలా చాలా సమర్ధవంతంగా, సమయోచితంగా హ్యాండిల్ చేశారు. సంపూర్ణ లాక్‌డవున్‌ను కరెక్ట్ టైమ్‌కి ప్రకటించారు. అంటున్నారు న్యూస్ ఇండియా టైమ్స్ ప్రచురణ కర్త పద్మశ్రీ డా.సుధీర్ పారిఖ్. దాదాపు 130 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో అది కూడా అత్యధిక శాతం ప్రజలు చిన్న చిన్న ఆవాసాల్లో కిక్కిరిసి ఉంటారు. ఇక మధ్య తరగతి కుటుంబాలు కూడా సగటున అరడజను మందితో 1200 చదరపు అడుగుల విస్తీర్ణంలోపే నివసిస్తారు. అలాంటి పరిస్థితుల్లో వ్యాధులు విస్తరించకుండా, రోగులు ప్రబల కుండా, మరణాలు తక్కువగా ఉండేలా చేయగలిగారని పారిఖ్ కొనియాడారు. పాశ్చాత్య మీడియా కవరేజ్‌ని నిశితంగా ఫాలో అయ్యే కొలంబస్ స్టేట్ యూనివర్సిటీ ఇన్ జార్జియా ప్రొఫెసర్ రమేష్‌రావు మాట్లాడుతూ భారత ప్రభుత్వోం, మోడీ ఇతర ప్రపంచ దేశాల నేతలతో పోలిస్తే అత్యంత క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కుంటున్నారు. అత్యధిక జనాభాతో, భారీగా విస్తరించిన అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో రాజకీయ ప్రత్యర్ధుల అస్త్రాలను కాచుకరుంటూ వెళ్లడం అంత సులభమైన విషయం కాదంటారాయన. భారతీయ ప్రజల్లో అత్యధిక సంఖ్యాకుల అవసరాలు తీర్చడం జరిగిందని, తాము ఒక సురక్షితమైన చేతుల్లో ఉన్నామని సరైన విధంగా మార్గదర్శకత్వం లభిస్తోందని వారు అర్ధం చేసుకున్నారన్నారాయన.
ఇండియనా యూనివర్సిటీ ఇన్ బ్లూమింగ్ టన్‌కు చెందిన పొలిటికల్‌సైన్స్ ప్రొఫెసర్ సుమిత్ గంగూలీ సర్వే ప్రకారం మోడీ పాప్యులారిటీపెరిగిందనేది నిజమేనని కోవిడ్ పరిస్థితులకు ప్రతి పక్షం సరైన ప్రత్యామ్నాయాలు చూపలేకపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. పర్యావరణవేత్త జయశ్రీ జోషి ఈశ్వర్ మాట్లాడుతూ మోడీ ప్రజాభిప్రాయన్ని తమకు అనుకూలంగా మలచుకోగల దిట్ట అన్నారు. దేశానికి వచ్చిన ప్రతి విపత్తూ మోడీకి సహాయకారిగానే పరిణమించిందన్నారు. ప్రజలు తమను బాధించే సమస్యలను పక్కనపెట్టి జాతీయస్థాయి సమస్యల కోసం ఆలోచించేలా వారి భావోద్వేగాలను ఆయన నియంత్రించగలుగుతున్నారన్నారు. అయితే పెద్ద సంఖ్యలో వలస కూలీల సంక్షోభం ఈ పాప్యులారిటీపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. నిరుపేదలకు ఊరటనిచ్చే ప్యాకేజీని ప్రకటించినా కూడా అది బీటలు వారవచ్చునని అభిప్రాయపడ్డారు.
ప్రిన్స్టన్కు చెందిన ఆర్ధిక శాస్త్రంలో పిహెచ్డి స్కాలర్ పార్థ్ పరిహార్ ఈ పోల్ ఫలితాలు ఖచ్చితత్వంతోనే ఉన్నాయన్నారు. మిగిలిన దేశాల కన్నా భిన్నంగా పరిమిత వనరులతోనే భారత్ ఈ సంక్షోభాన్ని చెప్పుకోదగిన స్థాయిలో ఎదుర్కోగలిగిందన్నారు. అందుకే మిగిలిన దేశాధినేతల మాదిరిగా సంక్షోభానంతరం ఆయా దేశాల ప్రజల అభిప్రాయాలకు ఇక్కడ భిన్నంగా ఉందన్నారు. మార్నింగ్ కన్సల్ట్‌తో పాటు సిఓటర్ మార్చిలో నిర్వహించిన సర్వే కూడా దాదాపుగా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించింది. అయితే ఈ పోల్ దిగువ ఆదాయ వర్గాల, నిరుపేదల మనోభావాలను ఖచ్చితంగా ప్రతిబింబించడం లేదని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఈ పోల్‌ని ఫోన్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్‌ల ద్వారా చేశారని అయితే అవి అన్ని వర్గాల వారికీ అందుబాటులో లేవని గుర్తు చేశారు. ఫోన్లు, కంప్యూటర్స్ వినియోగించని పెద్ద సంఖ్యలో ఉన్న నిరుపేదలను, లాక్ డవున్తో అష్టకష్టాల పాలై సొంతూర్లకు కాలి నడకన కాలే కడుపులతో హైవేలపై బయటు దేరిన వలసకూలీలను ఈ సర్వే పరిగణనలోకి తీసుకోలేదని అంటున్నారు.. ఏదేమైనా భారత దేశం నిదానంగా లాక్ డవున్ సడలింపులు పెంచుకుంటూ వెళుతున్న నేపధ్యంలో మోడీ అందరికన్నా మిన్నగా ఉన్న తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంటారా లేక ప్రపంచంలో పేరున్న నేతల్లో ఒకరిగా మాత్రమే మిగిలిపోతారా అని భారతదేశంతోపాటు ప్రపంచం కూడా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.






