దేశంలో 18 కోట్ల మందికి కరోనా…
–వెల్లడించిన ముంబయికి చెందిన థైరోకేర్ సంస్థ
–అత్యధిక కేసుల నగరాల్లో హైదరాబాద్‌కు 4వస్థానం
గుండె గుభేల్ మన్న వార్త ఇది. జస్ట్ 11 లక్షల కేసులు ఉన్నందుకే దేశం అల్లకల్లోలంగా ఉన్న పరిస్థితుల్లో… ఏకంగా 18కోట్ల మందికి కరోనా సోకిందంటూ ఓ ప్రైవేట్ ల్యాబ్ అంచనా వేయడం మరింత ఆందోళన కలిగించేదే. అయితే ఇందులో సాంత్వన కలిగించే విషయం ఏమిటంటే… ఈ 18 కోట్ల మందికి కరోనా వచ్చి తగ్గిపోయిందనేది. పెరుగుట పెరుగుట కొరకే…
ప్రస్తుతం 11 లక్షల కేసులతో భారత్ అత్యధికంగా కరోనా తాకిడికి గురైన దేశాల్లో అమెరికా, బ్రెజిల్‌ల సరసన నిలిచిన సంగతి తెలిసిందే. జులై నెల ఆరంభంలో రోజుకి 10శాతంగా ఉన్న పాజిటివ్ కేసుల పెరుగుదల ఇప్పుడు ఏకంగా 18.84 శాతానికి చేరింది. ఇప్పుడు టెస్టుల సంఖ్య బాగా పెరగడం కూడా దీనికో కారణం. ఈ నేపధ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ అధీకృత టెస్టింగ్ ల్యాబ్ అయిన థైరోకేర్ తాము చేసిన యాంటీ బాడీస్‌కి సంబంధించి 60వేల టెస్టుల డేటా విడుదల చేసింది. దీని ప్రకారం కొన్ని విశ్లేషణలు, అంచనాలు వేసింది.
కోట్లాది మందిలో యాంటీబాడీస్ వృద్ధి…
కరోనా వ్యాధి సోకిన వారిలో యాంటీ బాడీస్ వృద్ధి చెందుతాయనేది తెలిసిందే. ఈ నేపధ్యంలో సదరు యాంటీబాడీస్ కు సంబంధించిన పరీక్షలను పలు ప్రైవేట్ ల్యాబ్స్ నిర్వహిస్తున్నాయి. అందులో ఐసిఎమ్ఆర్ గుర్తింపు పొందిన థైరో కేర్ ఒకటి.థైరోకేర్ ల్యాబ్ కంపెనీలతో పాటు వ్యక్తులకూ యాంటి బాడీ టెస్టులు నిర్వహిస్తోంది. ఎలిసా, క్లియా కిట్స్‌ని ఈ టెస్టుల కోసం వినియోగిస్తోంది. గత నెల 23 నుంచి ఈ నెల 19 వరకూ నిర్వహించిన టెస్టుల డేటాను సంస్థ ఎండి డా.ఎ. వేలుమణి బుధవారం జాతీయ మీడియాతో పంచుకున్నారు. దేశవ్యాప్తంగా 65నగరాల్లో తమ థైరో కేర్ ల్యాబ్ 74,809 యాంటిబాడీ టెస్టులు నిర్వహించిందన్నారు. వీటిలో 60వేల టెస్టుల ఫలితాలను ఆయన విశ్లేషించారు. ఈ శాంపిల్స్ ద్వారా పాజిటివిటీ రేట్ 17.5శాతంగా ఉందన్నారు. అంటే 13,036 యాంటీ బాడీస్ టెస్టులు పాజటివ్‌గా నిర్ధారణ అయ్యాయన్నారు. వైరస్‌పై పోరాటం వ్యక్తిగతం..
ఈ యాంటి బాడీ టెస్టులు ద్వారా పాజిటివ్‌గా నిర్ధారణ అవడం అంటే అప్పటికే అంటే టెస్టు చేయడానికి 15 నుంచి 21 రోజులకు ముందే ఆ వ్యక్తికి వైరస్ సోకినట్టు అర్ధమని సంస్థ ప్రతినిధులు అంటున్నారు.తాము కనుగొనాల్సిన యాంటిబాడీస్‌ని ఈ పరీక్షలు అన్వేషిస్తాయని, ఈ యాంటిబాడీస్ వైరస్ సోకిన 14 రోజుల తర్వాత మాత్రమే ఉత్పత్తవుతాయని వివరించారు. అయితే వీటిలో మరో రకం యాంటీబాడీస్ మాత్రం ఇన్పెక్షన్ సోకిన 7 రోజులకి ఉత్పత్తి అవుతాయన్నారు. నమోదు చేయడం ఢిల్లీకి చెందిన సెరో సర్వే కూడా గతంలో ఈ రకమైన యాంటీ బాడీ‹స్ లñ క్కింపు చేసింది. తొలిదశలో కోవిడ్ వ్యాప్తిపై ఈ సంస్థ నిర్వహించిన స్టడీలో దాదాపు 23.48శాతం మందిలో యాంటిబాడీస్ వృధ్ధి కనిపించింది. అంటే మరో రకంగా చెప్పాలంటే అంత మంది కరోనా బారిన పడ్డారు. అయితే వీరిలో చాలా మందికి ఏ విధమైన లక్షణాలూ కనపడక పోవడం వల్ల ఈ విషయం తెలియనే తెలియదు.
మహారాష్ట్ర టాప్…హైదరాబాద్ ఫోర్త్…
600 పిన్‌కోడ్స్ వ్యాప్తంగా 20 రోజుల పాటు నారిమన్ పాయింట్ నుంచి జార్ఖండ్ దాకా నిర్వహించిన పరీక్షల డేటా ద్వారా థైరోకేర్ అంచనాల ప్రకారం దాదాపుగా 15శాతం భారతీయులు ఇప్పటికే నోవల్ కరోనా వైరస్‌తో పోరాటానికి అవసరమైన యాంటిబాడీస్‌ని సంతరించుకున్నారు. ఇందులో 3శాతం ఎక్కువ లేదా తక్కువ ఉండవచ్చు.ఈ డేటా ప్రకారం దేశంలో ఇప్పటికే 18 కోట్ల మందిలో కరోనా వైరస్‌ని ఎదుర్కునే యాంటీ బాడీస్ వృధ్ధి చెందాయి. అంటే అంత మందిలో కరోనా సోకింది. ఇక ఈ డేటా ప్రకారం అత్యధిక పాజిటివిటీ ఉన్న ప్రాంతం థానేలోని భివాండీ. ఇక్కడ 47.1శాతం పాజిటివిటీ నమోదైంది. బెంగుళూర్లోని పీన్యా దసరహల్లి ప్రాంతం 44శాతంతో రెండవ స్థానంలో ఉంది. ఇక 37.7శాతంతో ఢిల్లీలోని ఆనంద్‌విహార్ ఈ జాబితాలో మూడో స్థానం దక్కించుకుంది. హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్ ఏరియా 37.3శాతంతో నాల్గవ స్థానంలో నిలిచింది. 0.7శాతంతో అత్యల్ప పాజిటివ్ రేట్ ఉన్న ప్రాంతంగా మహారాష్ట్రలోని అలీభాగ్ ఏరియా జాబితాలో చోటు దక్కించుకుంది.
పరీక్షలు కోరుకున్నవారికే…
అయితే ఇదేమీ ప్రణాళికా బద్ధంగా చేసిన స్టడీ కాదని పరీక్షల కోసం తాము ఉన్నత స్థాయి వర్గాలు, వైట్ కాలర్ ఉద్యోగులనే ఎక్కువగా ఎంచుకున్నట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. దిగువ స్థాయి వర్గాలు దాదాపుగా లేనే లేవన్నారు. ఈ డేటాను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్‌కు అందజేశామన్నారు. ఈ డేటాను విశ్లేషించాల్సిన బాధ్యత వారిదేనన్నారు.తాము ఎవరిని పరీక్షించాలో ఎంపిక చేసుకోలేదని, పరీక్ష కోరుకున్నవారినే పరీక్షించామని అంటున్నారు. ఇందులో 80శాతం కార్పొరేట్లు, 15శాతం మంది రెసిడెన్షియల్ సొసైటీస్, 5శాతం మంది వ్యక్తుల నుంచి వచ్చిన డిమాండ్స్ మేరకే పరీక్షలు చేశామన్నారు. అయితే చిన్నా పెద్దా నగరాలన్నీ కవర్ చేశామన్నారు. జులై 30 కల్లా 1.2 లక్షల టెస్టులు నిర్వహిస్తామని తద్వారా మరింత ఖచ్చితమైన ఫలితాలు అందిస్తామని అంటున్నారు.






