WETA: కాలిఫోర్నియాలో ఘనంగా ‘వేటా’ బతుకమ్మ మహోత్సవం

కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ (Milpitas) నగరంలో ఉమెన్ ఎంపవర్ మెంట్ తెలుగు అసోసియేషన్ (WETA) ఆధ్వర్యంలో పూల పండుగను ఘనంగా నిర్వహించారు. పూల పరిమళాలతో, బతుకమ్మ పాటల స్వరలహరిలో నిండిపోయింది. వేటా ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ మహోత్సవం సంప్రదాయబద్ధంగా, సాంస్కృతిక రీతిలో అత్యంత వైభవంగా నిర్వహించబడిరది. తెలంగాణ జానపద సంప్రదాయాన్ని ప్రతిబింబించే ఈ పండుగకు 800 మందికి పైగా ప్రేక్షకులు పెద్దలు, చిన్నలు కుటుంబ సమేతంగా హాజరై, రంగురంగుల బతుకమ్మలతో ఈ వేడుకను మరింత అందంగా మార్చారు.
ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా భారత కాన్సుల్ జనరల్ సాన్‌ఫ్రాన్సిస్కో కాలిఫోర్నియా, డాక్టర్ కె. శ్రీకర్ రెడ్డి గారు, ఆయన సతీమణి ప్రతిమ రెడ్డి గారు విచ్చేయగా, అనేక కమ్యూనిటీ సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. వీరి హాజరుతో కార్యక్రమం మరింత శోభాయమానంగా మారింది. తెలంగాణ నేల నుండి పూల పండుగగా పేరు పొందిన బతుకమ్మ వేడుకలు విదేశాల్లోనూ అదే ఉత్సాహంతో జరగడం గర్వకారణం. మహిళలు వలయాకారంగా చేరి బతుకమ్మ పాటలు పాడుతూ, పల్లకిలి పాటలతో హోరెత్తగా, ప్రముఖ నటి ఉదయ భాను గారు, నృత్య నిపుణుడు కొండ్రు హుస్సేన్ గారు, మరియు చురుకైన యాంకర్ రాచన గారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వారందరి ప్రదర్శనలు ఆహుతుల హృదయాలను మంత్రముగ్ధుల్ని చేశాయి.
తెలంగాణ సాంప్రదాయ పండుగ బతుకమ్మ వేడుకల నిమిత్తం ప్రత్యేకంగా భారత్ నుండి అమెరికా విచ్చేసిన శ్రీమతి ఝాన్సీ రెడ్డి గారు ప్రస్తుతం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) ఉపాధ్యక్షురాలిగా, అలాగే పాలకుర్తి శాసనసభ నియోజకవర్గం మరియు సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా సేవలందిస్తున్నారు. అదేవిధంగా వేటా ఫౌండర్‌గా, అడ్వయిజరీ చైర్ గా సుదీర్ఘకాలంగా మహిళా సాధికారతకు కృషి చేస్తూ, సమాజ సేవలో విశేష పాత్ర పోషిస్తున్నారు. బతుకమ్మ ఉత్సవాల సందర్భంలో ఆమె హాజరు కావడం ప్రవాస తెలంగాణ వాసులకు గర్వకారణంగా నిలిచింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన వేటా సభ్యులైన సుగుణ రెడ్డి, రత్నమాల వంక, హైమా రెడ్డి అనుమండ్ల, అనురాధ అలిశెట్టి, జ్యోతి రెడ్డి వీయం, శైలజా రెడ్డి కల్లూరి, సునీత గంప, విశ్వ రెడ్డి వెమిరెడ్డి, పూజా రెడ్డి లక్కడి, అభితేజ కొండా మరియు సేవా సభ్యులు, స్వచ్ఛంద సేవకులను హృదయపూర్వకంగా అభినందించారు. వీరి కృషి వల్లే ఈ వేడుక ఈ స్థాయిలో విజయవంతమైందని నాయకులు పేర్కొన్నారు.
వేటా ఎన్నో సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది. అంధ బాలుర పాఠశాలకు కంప్యూటర్లు, కోచింగ్ ఇన్స్ట్రక్టర్‌ను అందించడమేగాక, పాఠశాల విద్యార్థులకు బెంచిలు, పుస్తకాలు, ఫ్యాన్లు మొదలైన అవసరమైన సదుపాయాలను అందించింది. ప్రతి ఏడాది వందలాది పిల్లలకు సహాయాన్ని అందిస్తూ వస్తోంది, ఇది మరింత విస్తరించబోతున్నదని సంస్థ తెలియజేసింది.
తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు విదేశాల్లో గౌరవనీయంగా నిలబడి, సమాజ సేవలోనూ అగ్రగామిగా నిలిచిన వేటా ఈ ఏడాది బతుకమ్మ వేడుకలతో మరోసారి తన ప్రతిభను చాటుకుంది.