Trump: ప్రవాసులను వదలని ట్రంప్.. నగదు బదిలీపైనా 5శాతం పన్ను..?

అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఓ దేశాధ్యక్షుడిలా కాకుండా ఫక్తు వ్యాపార వేత్తలా ప్రవర్తిస్తున్నారు. ఎక్కడ నుంచి డబ్బు వస్తుందని భావిస్తే చాలు.. అక్కడ వేలు పెడుతున్నారు. లేటెస్టుగా ప్రవాసులపైనా ట్రంప్ కన్నేశారు. అమెరికాలో ఉన్న ప్రవాసీయులు తమ స్వదేశానికి చేసే నగదు బదిలీపై (Outward Remittances) 5శాతం పన్ను విధించేందుకు ట్రంప్ సర్కార్ సిద్ధమవుతోంది. ఇది అమల్లోకి వస్తే లక్షలాది మంది భారతీయులపైనా(NRI) ప్రభావం చూపనుంది.
రెమిటెన్స్ పన్ను విధింపునకు సంబంధించి ప్రతిపాదిత బిల్లు ప్రతినిధుల సభ ముందుకు రానుంది. విదేశీయులు సహా హెచ్-1బీ, గ్రీన్ కార్డుదారులు బదిలీ చేసే నగదుపై ఈ పన్ను వర్తించనుంది. కేవలం భారత్‌కు వచ్చే నగదుకే దాదాపు 1.6 బిలియన్ డాలర్లు పన్ను రూపంలో చెల్లించాల్సి వస్తుందని అంచనా.
ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం.. అమెరికా నుంచే భారత్‌కు అందుతున్న రెమిటెన్స్‌లు 2010లో 55.6 బిలియన్ డాలర్లుగా ఉండగా.. 2023-24కు 118.7 బి.డాలర్లకు పెరిగింది. ఇందులో అమెరికా నుంచి 27శాతం (32 బి.డాలర్లు) రాగా.. దానిపై 5శాతం పన్ను అంటే 1.64 బి.డాలర్లు అవుతుంది. ఇక గతంలో భారత్‌కు గల్ఫ్ దేశాల నుంచి ఎక్కువ నగదు బదిలీ రూపంలో వస్తుండగా.. క్రమంగా అమెరికా, బ్రిటన్, సింగపూర్, కెనడా, ఆస్ట్రేలియాల నుంచి రావడం మొదలైంది. భారత్‌కు బదిలీ అయ్యే మొత్తంలో సగానికిపైగా అభివృద్ధి చెందిన దేశాలనుంచే వస్తోంది. వీటిలో అమెరికాదే అగ్రస్థానం.
ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం.. ప్రపంచంలోనే అత్యధికంగా రెమిటెన్స్‌లు అందుకుంటున్న దేశాల్లో 2008 నుంచి భారత్ అగ్రస్థానంలో ఉంది. ప్రపంచ రెమిటెన్స్‌లలో 11శాతం ఉండగా.. 2024నాటికి 14శాతానికి పెరిగింది. ప్రస్తుతం దాదాపు 129 బిలియన్ డాలర్లు రెమిటెన్స్ రూపంలో వస్తున్నట్లు అంచనా. ఆ తర్వాతి స్థానాల్లో మెక్సికో (68 బి.డాలర్లు), చైనా (48 బి.డాలర్లు), ఫిలిప్పీన్స్ (40 బి.డాలర్లు), పాకిస్థాన్ (33 బి.డాలర్లు) దేశాలు ఉన్నాయి.