తెలుగు కమ్యూనిటీ ధైర్యంగానే ఉంది – చివుకుల ఉపేంద్ర, న్యూజెర్సి
డెమోక్రట్ పార్టీకి చెందిన తెలుగు ప్రముఖులు, న్యూజెర్సీ అసెంబ్లీకి డిప్యూటీ స్పీకర్‌గా పని చేసిన చివుకల ఉపేంద్ర తెలుగు టైమ్స్‌తో మాట్లాడుతూ అమెరికాలో కరోనా సంక్షోభం తీవ్రంగానే ఉన్నా, ఇండియన్ కమ్యూనిటీ క్షేమంగానే ఉందని, ముఖ్యంగా తెలుగు కమ్యూనిటీ ధైర్యంగా పరిస్థితిని ఎదుర్కొని భద్రంగా ఉందని తెలిపారు. అనేక విషయాల గురించి వివరంగా చెపుతూ అమెరికాలో నివసిస్తున్న ఉద్యోగులకు గ్రీన్‌కార్డు ఇవ్వడం లో జాప్యం ఉంది గాని, మిగతా వారికి ఆ నిర్ణయం వలన ఎలాంటి ఇబ్బదులు లేవని, అలాగే హెచ్ 1 స్టూడెంట్ వీసాల పొడిగింపునకు ఒప్పుకోవడం వలన ఇమ్మిగ్రేషన్ ఇబ్బందులు కూడా ఎక్కువ మందికి లేవని అన్నారు.
చాలామంది ఉద్యోగస్తులు, ప్రస్తుతం ఇంటి నుంచి పనిచేస్తున్నారని, పెద్ద కంపెనీలు అన్ని ఈ విధమైన ఏర్పాటుని కొంత కాలం ఉంచుతారని దాదాపు డిసెంబర్ వరకు ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. ఇకపోతే గ్రాసరీ షాపులు, రెస్టారెంటులు మెల్లమెల్లగా తెరుస్తున్నారని, అందువలన అందులో చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వారికి కూడా వారి కష్టకాలం అయిపోయింది అని అనుకోవచ్చని, పెద్ద షాపులు, గోల్డ్ షాపులు లాంటివి ఇంకా తెరవలేదు కానీ అందులో పని చేసే తెలుగు వారి సంఖ్య చాలా తక్కువ అని ఉపేంద్ర అన్నారు.
అమెరికాలో దేవాలయాలు కూడా మెల్లగా తెరుస్తున్నారని పూజలు కూడా ఆన్లైన్ లో చేసుకోవచ్చని చెపుతున్నారని అన్నారు. మెల్లగా సాధారణ వాతావరణం వస్తోందని, గోల్ప్ కోర్ట్లు కూడా 18 హోల్స్ బదులు ఆరు హోల్స్ తో ప్రారంభిస్తున్నారని, అమెరికాలో ఎంటర్టైన్మెంట్, ట్రావెల్, ఔటింగ్ లాంటి వాటిని ఇన్ని రోజులు లేకుండా ప్రజలు ఉండలేరని, అవన్ని వరుసగా తెరుచుకొంటున్నాయని ఉపేంద్ర అన్నారు.
అలాగే తెలుగు సంఘాలు కూడా మంచి పనులు చేస్తున్నారని, కష్టాల్లో ఉన్న తెలుగువారి కోసం అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, ఒకవైపు వెచినార్ల ద్వారా, ఇమ్మిగ్రేషన్, కోవిడ్ 19 మీద ఇంకో వైపు మాస్క్‌ల పంపిణి, ఆహారం పంపిణీ మొదలగు అనేక మంచి పనులు చేస్తున్నారని అన్నారు. అన్ని విధాలుగా తెలుగు కమ్యూనిటీ కరోనాని ఎదుర్కొని జాగ్రత్తలు తీసుకోని ముందుకు వెళుతోంది. అందరి మద్దతుతో ఈ గండం నుంచి బయటపడి మళ్ళీ సాధారణ పరిస్థితులు వచ్చే వరకు ధైర్యంగా ముందుకు వెళదామని ఉపేంద్ర చివుకుల అన్నారు.






