TTA: టీటీఏ డల్లాస్ చాప్టర్ ఆధ్వర్యంలో వైభవంగా బతుకమ్మ వేడుకలు

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) డల్లాస్ చాప్టర్ నిర్వహించిన బతుకమ్మ (Bathukamma) వేడుకలు వైభవంగా జరిగాయి. ఫ్రిస్కో ఫ్లైయర్స్‌లో జరిగిన ఈ వేడుకల్లో సుమారు 6,000 మందికి పైగా హాజరై కార్యక్రమాన్ని ఘనవిజయం చేశారు. టీటీఏ (TTA) అధ్యక్షుడు నవీన్ రెడ్డి మల్లిపెద్ది నాయకత్వంలో ఈ వేడుకలను విజయవంతంగా నిర్వహించారు. డెవలప్‌మెంట్ డైరెక్టర్ ప్రవీణ్ చింత, సేవ డేస్ కోఆర్డినేటర్ విశ్వ కంది కూడా ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించారు. ఈ వేడుకల్లో పాల్గొని అందర్నీ ఉత్సాహపరిచిన టీటీఏ (TTA) అధ్యక్షుడు నవీన్ రెడ్డి మల్లిపెద్దికి టీటీఏ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది.
ఈ బతుకమ్మ (Bathukamma) వేడుకల్లో ఎలాంటి లోటు లేకుండా చూసుకున్న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ప్రవీణ్ చింత, విశ్వ కంది, వెంకట్ అన్నపరెడ్డి, నరేష్ బైనగారి, శ్రీకాంత్ గాలి, మహిళా విభాగం నాయకురాలు ప్రశాంతి చింత సహా డల్లాస్ చాప్టర్ కోర్ టీమ్స్‌ను టీటీఏ (TTA) ప్రత్యేకంగా ప్రశంసించింది. ఈ సంవత్సరం వేడుకలకు యాంకర్ ఉదయభాను, నటి అనన్య, జానపద గాయకులు గంగ, శ్రీను ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకల్లో పిల్లలు, పెద్దలు అంతా కలిసి కోలాటం, సాంస్కృతిక ప్రదర్శనలు చేయగా.. వెండర్ బజార్, లైవ్ బ్యాండ్/డీజే అందర్నీ ఉత్సాహపరిచాయి. గంటకోసారి రాఫుల్స్‌లో విజేతలకు గోల్డ్ కాయిన్స్, టీవీ, ఎయిర్‌పాడ్స్ వంటి బహుమతులు కూడా అందించడం గమనార్హం.