TTA: న్యూయార్క్‌లో ఘనంగా టిటిఎ బతుకమ్మ వేడుకలు

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) న్యూయార్క్ ఆధ్వర్యంలో భవ్యమైన బతుకమ్మ వేడుకలు 2025 సెప్టెంబర్ 28, ఆదివారం, న్యూయార్క్‌లోని రాడిసన్ హోటల్ బాల్‌రూమ్, హపాగ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సంవత్సరపు వేడుకలు మరింత రంగులమయంగా, ఉత్సాహభరితంగా, మరపురానివిగా నిలిచాయి. స్వదేశంలోని వేడుకలకు ఏమాత్రం తీసిపోకుండా నిర్వహించిన ఈ వేడుకలలో, 1000 మందికి పైగా సభ్యులు కుటుంబ సమేతంగా ఉత్సాహంగా పాల్గొని, తెలంగాణ సాంస్కృతిక పండుగగా జరుపుకున్నారు.
ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణగా 8 అడుగుల ఎత్తైన బతుకమ్మ, నిలిచింది. దీనిని ప్రాంతీయ ఉపాధ్యక్షులు శ్రీ జయప్రకాశ్ ఎంజపూరి గారు, మొత్తం టిటిఎ న్యూయార్క్ బృందం, ఇండియా నుండి తెప్పించిన నిజమైన పూలతో ముందు రాత్రంతా శ్రమకోర్చి తయారు చేశారు. బతుకమ్మ పైన దేవి విగ్రహం సుందరంగా తిరుగుతూ అందరి దృష్టిని ఆకర్షించింది. వైభవంగా అలంకరించుకున్న స్త్రీలు, మెరిసే బంగారు ఆభరణాలు ధరించి, పిల్లలతో కలిసి వారు పేర్చిన రంగు రంగుల బతుకమ్మలు తీసుకు వచ్చి వేడుకలలో పాల్గొన్నారు. చిన్నా పెద్దా కలిసి, వలయాకారంగా తిరుగుతూ, బతుకమ్మ జానపద పాటలకు నృత్యం చేయడం తెలంగాణ సంప్రదాయ సౌందర్యాన్ని ప్రతిబింబించింది. వ్యాఖ్యాత శ్రీ లక్ష్మి కులకర్ణి, ఆహూతులను హుషారు పరుస్తూ, వారితో కలిసి నృత్యం చేస్తూ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించారు.
సింగర్ లావణ్య బతుకమ్మ పాటలు పాడుతూ అలరించారు.
కార్యక్రమం లలితాసహస్రనామ పారాయణం తో ఆరంభమై, గురు సాధన పరంజి శిష్యులచే మహిషాసుర మర్దిని రూపకల్పనలో ‘‘అయిగిరి నందిని’’ నృత్యం, లైవ్ బ్యాండ్ డిజె తో ఉత్సాహభరితంగా సాగింది. చివరగా సభ్యులంతా జోరుగా దాండియా నృత్యాలు చేస్తూ కార్యక్రమానికి అధ్బుతమైన ముగింపు జోడిరచారు. ఇంత గొప్ప విందు, వినోదాలతో కూడిన కార్యక్రమాన్ని అందించిన తెలంగాణా అమెరికన్ సంఘం వారిని తెలంగాణా సంస్కృతి సంప్రదాయాలను న్యూయార్క్ లో ఆవిష్కరిస్తున్నందుకు అందరూ అభినందించారు.
ఈ వేడుకలకు వచ్చినవారికి రుచికరమైన తెలంగాణ సాంప్రదాయ వంటకాలు వడ్డించారు. వినూత్నమైన షాపింగ్ స్టాల్స్ అందరినీ ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమ నిర్వహణ కోసం దాదాపు 3 నెలలుగా సన్నాహాలు చేస్తూ, కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన న్యూయార్క్ బృందాన్ని డా. పైళ్ళ మల్లా రెడ్డి గారు అభినందించారు. తెలంగాణా అమెరికన్ తెలుగు సంస్థ ఏర్పడి తెలంగాణా వాసుల నిర్విరామ సేవలో సరిగా పది సంవత్సరాలు అయిన శుభ సందర్భంలో హైదరాబాద్ లో నిర్వహించనున్న దశాబ్ది వేడుకలకు అందరినీ ఆహ్వానించారు.
న్యూజెర్సీ నుండి విచ్చేసిన డాక్టర్ మోహన్ పాటలోల్ల (సలహా సంఘం సహాధ్యక్షులు), శివరెడ్డి కొల్ల (ప్రధాన కార్యదర్శి) అందరికీ బ్రతుకమ్మ, మరియు దసరా శుభాకాంక్షలు అందించారు.
సహకరించిన తెలుగు న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంస్థ (నైటా) ప్రెసిడెంట్ వాణి అనుగు, సోదర సంస్థల ప్రతినిధులు, తెలుగు సారస్వత సాంస్కృతిక సంస్థ (టిఎల్ సిఎ) ప్రెసిడెంట్ సుమంత్ రామిశెట్టి, ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) రీజనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస భర్తవరపు, వారి వారి బోర్డు ఆఫ్ డైరెక్టర్లు, కార్యవర్గ సభ్యులు హాజరై కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన న్యూయార్క్ బృందాన్ని అభినందించారు.
ఈ వేడుకల సందర్భంగా ఉత్తమ బతుకమ్మ పోటీ నిర్వహించారు. విజేతలకు బహుమతులుగా 6 బంగారు నాణేలు, 6 వెండి నాణేలు ప్రకటించారు. శ్రీ పైళ్ళ మల్లా రెడ్డి గారు, వారి సతీమణి, శ్రీమతి సాధన రెడ్డి గారు విజేతలకు బహుమతులు అందజేశారు.
మొత్తం కార్యక్రమానికి స్పాన్సర్‌గా నిలిచిన ప్రముఖ దాత, ఔషధ రంగ దిగ్గజం డాక్టర్ పైళ్ళ మల్లారెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే, కార్యక్రమానికి ఆర్ధికంగా సహకరించిన సహృదయులైన దాతలకు శాలువాలు, పుష్పగుచ్ఛాలు అందించి సన్మానించారు. ఈ వేడుక విజయవంతం కావడానికి టిటిఎ వ్యవస్థాపకులు డాక్టర్ పైల్ల మల్లారెడ్డి గారి, సలహా మండలి అధ్యక్షులు డాక్టర్ విజయపాల్ రెడ్డి గారి, సలహా మండలి సభ్యుల మరియు అధ్యక్షులు శ్రీ నవీన్ రెడ్డి గారి మార్గదర్శకత్వం ప్రేరణగా నిలిచింది. న్యూ యార్క్ రీజనల్ వైస్ ప్రెసిడెంట్, జయప్రకాష్ ఎంజపూరి, కార్యక్రమానికి విచ్చేసిన ఆహూతులకు ధన్యవాదాలు తెలియజేశారు.
కార్యక్రమ ప్రణాళిక, నిర్వహణలో గత మూడు నెలలు గా విశేషంగా తోడ్పడిన న్యూయార్క్ టీం సభ్యులు జాతీయ కోశాధికారి సహోదర్ పెద్దిరెడ్డి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఉషా మన్నెం, రంజీత్ క్యాతం, జాతీయ సారస్వత డైరెక్టర్ శ్రీనివాస గూడూరు, కోర్ టీం, మల్లిక రెడ్డి, రమ కుమారి వనమ, సత్య గగ్గినపల్లి, సునీల్ రెడ్డి గడ్డం, వాణి సింగిరికొండ, హరి చరణ్ బొబ్బిలి, సౌమ్య శ్రీ చిత్తరీ, విజేందర్ బాస, భరత్ వుమ్మన్నగారి, మౌనిక బొడిగం లకు కూడా కృతజ్ఞతలు తెలియజేశారు.