మరణాలు పెరిగినా మార్కెట్లు తెరుచుకోవాల్సిందే
కరోనా వల్ల మరింతమంది అనారోగ్యం పాలైనా, మరిన్ని మరణాలు సంభవించినా అమెరికా ఆర్థిక వ్యవస్థ తెరుచుకోవాల్సిందేనని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సృష్టం చేశారు. అమెరికన్లను పోరాటయోధులుగా అభివర్ణించిన ఆయన, వారు తిరిగి సాధారణ జీవితాన్ని ప్రారంభించాలని పిలుపునిచ్చారు. కరోనా నేపథ్యంలో లాక్డౌన్ విధించిన అనంతరం తొలిసారి అధికారిక పర్యటన చేశారు. మంగళవారం అరిజోనా రాష్ట్రంలోని ఫీనిక్స్లో మాస్కుల తయారు చేసే హనీవెల్ ఫ్యాకర్టరీని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో ట్రంప్ మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థను తిరిగి తెరిచే క్రమంలో మరిన్ని ఇబ్బందులకు గురవుతాం. చాలా మందిపై ప్రభావం చూపుతుంది. మరిన్ని మరణాలు సంభవిస్తాయి అని చెప్పారు. అయినా సరే దేశం సాధారణస్థితికి చేరాల్సిందేనన్నారు. వ్యాక్సిన్ వచ్చినా రాక పోయినా వైరస్ నుంచి బయటపడతామని ధీమా వ్యక్తం చేశారు.






