Inter Board : ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం
ఇంటర్మీడియేట్ విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉండేందుకు తెలంగాణ ఇంటర్ బోర్డు (Intermediate Board) కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ పరీక్షల హాల్‌టికెట్ల (Hall tickets)ను విద్యార్థుల తల్లిదండ్రుల వాట్సాప్‌కి (WhatsApp) పంపనున్నట్టు ఇంటర్ బోర్డు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 25 నుంచి పరీక్షలు (Exams) ప్రారంభం కానున్న నేపథ్యంలో 45 రోజుల నుంచి రెండు నెలల ముందే తల్లిదండ్రుల వాట్సప్‌కు వారి పిల్లల హాల్‌టికెట్లను పంపనున్నారు. తద్వారా హాల్ టికెట్లో తప్పొప్పులను ముందే గుర్తించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థుల తల్లి దండ్రులు హాల్‌టికెట్‌లో ముద్రించిన వివరాలు క్షుణ్ణంగా పరిశీలించాలని, ఏమైనా తప్పులు ఉంటే సంబంధిత కళాశాల ప్రిన్సిపల్‌కి (Principal) సమాచారం ఇవ్వాలని ఇంటర్ బోర్డ్ ఓ ప్రకటనలో తెలిపింది. హాల్‌టికెట్ నంబర్, పరీక్షా కేంద్రం చిరునామాతో పాటు ఏ రోజు ఏ పరీక్ష జరుగుతుందో తల్లిదండ్రులకు తెలియజెప్పడమే ప్రధాన ఉద్దేశమని పేర్కొంది. అధిక శాతం తల్లిదండ్రుల వద్ద స్మార్ట్ ఫోన్ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.






