AP Investments: పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్ దూకుడు!
భారత పారిశ్రామిక యవనికపై ఆంధ్రప్రదేశ్ మరోసారి తన సత్తా చాటింది. దేశంలోని బడా రాష్ట్రాలను, పారిశ్రామిక దిగ్గజాలను వెనక్కి నెట్టి, పెట్టుబడుల ఆకర్షణలో నంబర్ వన్ స్థానంలో నిలిచింది. బ్యాంక్ ఆఫ్ బరోడా తాజాగా విడుదల చేసిన నివేదిక, ఫోర్బ్స్ ఇండియా వెల్లడించిన గణాంకాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 2026 ఆర్థిక సంవత్సరం మొదటి మూడు త్రైమాసికాల డేటాను పరిశీలిస్తే.. దేశం మొత్తానికి వస్తున్న పెట్టుబడులలో సింహభాగం ఆంధ్రప్రదేశ్ ఖాతాలోకే చేరుతోంది.
తాజా గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా ప్రతిపాదిత పెట్టుబడులలో ఆంధ్రప్రదేశ్ వాటా ఏకంగా 25.3 శాతంగా నమోదైంది. అంటే, భారతదేశంలోకి పెట్టుబడి రూపంలో వస్తున్న ప్రతి నాలుగు రూపాయలలో ఒక రూపాయికి పైగా ఒక్క ఏపీకే వస్తోంది. ఇది సామాన్యమైన విషయం కాదు. ఒకప్పుడు గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాలు ఈ జాబితాలో ఆధిపత్యం చెలాయించేవి. కానీ నేడు పరిస్థితి మారింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాటా 25.3 శాతం ఉండగా, ఒడిశా 13.1శాతం, మహారాష్ట్ర 12.8శాతం, తెలంగాణ 9.5శాతం, గుజరాత్ 7.1శాతం పెట్టుబడులను ఆకర్షించాయి. రెండో స్థానంలో ఉన్న ఒడిశా (13.1%), మూడో స్థానంలో ఉన్న పారిశ్రామిక దిగ్గజం మహారాష్ట్ర (12.8%) కంటే ఏపీ దాదాపు రెట్టింపు వాటాను కలిగి ఉండటం గమనార్హం. ఇక పొరుగున ఉన్న తెలంగాణ (9.5%), ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ (7.1%) ఏపీ దరిదాపుల్లో కూడా లేకపోవడం ఏపీ సాధించిన ప్రగతికి నిదర్శనం.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబుకున్న విజనరీ ఇమేజ్, పెట్టుబడిదారుల్లో ఆయన పట్ల ఉన్న నమ్మకం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదంతో ఏపీని ముందుకు తీసుకెళ్లిన చంద్రబాబు, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మంత్రంతో పారిశ్రామికవేత్తలను ఆకర్షిస్తున్నారు.
మరోవైపు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ చొరవ కూడా ఈ విజయానికి కీలక కారణం. దావోస్ వేదికగా జరిగిన ఒప్పందాలు కావచ్చు, అమెరికా పర్యటనల్లో దిగ్గజ కంపెనీలతో జరిపిన చర్చలు కావచ్చు.. లోకేశ్ దూకుడు పెట్టుబడుల వరదకు ద్వారాలు తెరిచింది. పెట్టుబడిదారులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, అనుమతుల్లో జాప్యం లేకపోవడం, ప్రభుత్వాధినేతలే స్వయంగా చొరవ తీసుకుని సమస్యలను పరిష్కరించడం వంటి అంశాలు కార్పొరేట్ వర్గాల్లో భరోసాను నింపాయి.
పెట్టుబడిదారులు గుజరాత్, మహారాష్ట్రలను కాదని ఏపీ వైపు మొగ్గు చూపడానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి. ఏపీకి సుదీర్ఘ తీరప్రాంతం ఉంది. ఎగుమతులు, దిగుమతులకు అనువైన ఓడరేవులు ఏపీ సొంతం. ఇది లాజిస్టిక్స్ పరంగా కంపెనీలకు పెద్ద ఊరట. ఏపీ ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ హబ్ గా అవతరిస్తోంది. పునరుత్పాదక ఇంధన వనరుల విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న పాలసీలు రిలయన్స్, అదానీ వంటి బడా సంస్థలను ఆకర్షిస్తున్నాయి. పరిశ్రమల స్థాపనకు కావాల్సిన భూమి, నీరు సమృద్ధిగా ఉండటం మరో సానుకూల అంశం. నూతన ప్రభుత్వం తీసుకువచ్చిన పారిశ్రామిక విధానం పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ పరుస్తోంది. ఇన్సెంటివ్స్ విషయంలో స్పష్టత ఇవ్వడం కలిసొచ్చింది.
గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు ఇప్పటికే పారిశ్రామికంగా సంతృప్త స్థాయికి చేరుకున్నాయనే వాదన ఉంది. అక్కడ భూ సేకరణ క్లిష్టంగా మారడం, ట్రాఫిక్, కాలుష్య సమస్యలు వంటివి కొత్త పెట్టుబడులకు అవరోధంగా మారుతున్నాయి. మరోవైపు తెలంగాణలో హైదరాబాద్ మినహా ఇతర ప్రాంతాలకు పరిశ్రమల విస్తరణ ఆశించినంతగా జరగకపోవడం, రాజకీయ అనిశ్చితి వంటి అంశాలు ఆ రాష్ట్ర వాటా 9.5 శాతానికి పరిమితం కావడానికి కారణమయ్యాయి.
కేవలం కాగితాల మీద ఒప్పందాలే కాకుండా, గ్రౌండ్ లెవెల్ లో పనులు మొదలయ్యేలా చూడటంలో ఏపీ ప్రభుత్వం చూపిస్తున్న శ్రద్ధ ఫలితాలను ఇస్తోంది. ఫోర్బ్స్ నివేదిక ఏపీ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో పెంచింది. ఈ పెట్టుబడులు వాస్తవ రూపం దాల్చితే.. రానున్న రోజుల్లో లక్షలాది ఉద్యోగ అవకాశాలు, రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రంలో సమూల మార్పులు తథ్యం. చంద్రబాబు అనుభవం, లోకేశ్ యువతరం ఆలోచనలు జతకలిసి ఆంధ్రప్రదేశ్ ను ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారుస్తున్నాయనడంలో సందేహం లేదు.






