KCR: అసెంబ్లీకి కేసీఆర్ ‘ఆ ఒక్క రోజే’ ఎందుకు?
తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీరు ఎప్పుడూ ఒక మిస్టరీనే. ఆయన ఎప్పుడు ఎలా స్పందిస్తారో, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో సొంత పార్టీ నేతలకు కూడా అంతుచిక్కదు. అయితే, ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల విషయంలో కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరి మాత్రం సొంత పార్టీ శ్రేణులను అయోమయానికి గురిచేస్తుంటే, అధికార పక్షానికి విమర్శనాస్త్రంగా మారుతోంది. అసెంబ్లీ సమావేశాలకు ముందు రోజు జలవివాదాలపై ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన కేసీఆర్.. సభలోనూ అదే స్థాయిలో విరుచుకుపడతారని అంతా భావించారు. కానీ, తొలిరోజు సభకు వచ్చి, ఆ తర్వాత రోజు నుంచి ముఖం చాటేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
అసెంబ్లీ సమావేశాలకు ముందు కేసీఆర్ నిర్వహించిన మీడియా సమావేశం బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త జోష్ నింపింది. కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టిందంటూ ఆయన చేసిన విశ్లేషణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ ఊపుతోనే ఆయన అసెంబ్లీకి హాజరవుతున్నారని తెలియడంతో, సభలో రేవంత్ రెడ్డి సర్కార్‌ను కేసీఆర్ కడిగిపారేస్తారని, సాగునీటి రంగంపై ప్రభుత్వాన్ని ఇరుకున పెడతారని విశ్లేషకులు సైతం అంచనా వేశారు. ఆ అంచనాలకు తగ్గట్టే తొలిరోజు ఆయన అసెంబ్లీకి వచ్చారు. కానీ, ఆ తర్వాత రోజు నుంచి ఆయన జాడ లేదు. దీంతో “అసలు తొలిరోజు ఎందుకు వచ్చినట్టు? ఇప్పుడు ఎందుకు రానట్టు?” అనే ప్రశ్నలు పార్టీ వర్గాల్లోనే తలెత్తుతున్నాయి. కేవలం హాజరు పట్టికలో పేరు నమోదు కోసమే వచ్చారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అసెంబ్లీలో కేసీఆర్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. “కేసీఆర్ యాక్టివ్‌గా లేకుంటే బీఆర్ఎస్ జీరో” అని ఆమె బహిరంగంగానే అంగీకరించారు. ఇది ఒక రకంగా వాస్తవమే అయినా, మరో కోణంలో కేసీఆర్ సభకు రావాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పినట్లయింది. సభలో హరీష్ రావు, కేటీఆర్ వంటి సీనియర్లు ప్రభుత్వంపై పోరాడుతున్నా, కేసీఆర్ ఉంటే ఉండే ఇంపాక్ట్ వేరు అని శ్రేణులు భావిస్తున్నాయి. అధినేత వెనకుంటే ఎమ్మెల్యేల గొంతులో మరింత బలం పెరుగుతుందన్నది వారి అభిప్రాయం. కానీ, కేసీఆర్ మాత్రం ఇంటికే పరిమితమవడం, అసెంబ్లీ వైపు చూడకపోవడం శ్రేణుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తోంది.
మరోవైపు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు పదేపదే కేసీఆర్‌ను సభకు రావాలంటూ సవాల్ విసురుతున్నారు. “ధైర్యముంటే సభకు వచ్చి చర్చలో పాల్గొనాలి.. పారిపోకూడదు” అంటూ సీఎం ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. సాధారణంగా ఇలాంటి సవాళ్లను కేసీఆర్ సీరియస్‌గా తీసుకుంటారు. కానీ ఈసారి ఆయన మౌనం పాటించడం వెనుక ఆంతర్యం ఎవరికీ బోధపడటం లేదు. అసెంబ్లీలో సంఖ్యాబలం తక్కువగా ఉందనా? లేక తన స్థాయికి తగ్గ చర్చ జరగడం లేదని భావిస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ రాకపోవడాన్ని అధికార పక్షం తమకు అనుకూలంగా మార్చుకుంటోంది. ఆయన జవాబు చెప్పలేకే సభకు రావడం లేదనే సంకేతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది.
కేసీఆర్ తీరును గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు రెండు రకాల వాదనలు వినిపిస్తున్నారు. ఒకటి.. ఇదంతా కేసీఆర్ వ్యూహంలో భాగం కావచ్చని అంటున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత మరింత పెరిగే వరకు వేచి చూసి, అప్పుడు సరైన సమయంలో రంగంలోకి దిగాలనే ఆలోచనలో ఆయన ఉండవచ్చని ఒక వాదన. ప్రస్తుతానికి కేటీఆర్, హరీష్ రావులకు బాధ్యతలు వదిలేసి, తాను తెరవెనుక ఉండాలని భావిస్తుండవచ్చు. మరోవైపు ఓటమి తర్వాత కేసీఆర్‌లో కొంత నిర్లక్ష్యం లేదా నైరాశ్యం ఆవహించి ఉండవచ్చని అంటున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత ప్రతిపక్ష నేతగా సభలో కూర్చోవడానికి ఆయన ఇష్టపడటం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఏది ఏమైనా, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అధినేత ముందుండి నడిపించాలని కార్యకర్తలు కోరుకుంటారు. కేసీఆర్ మౌనం వీడి, అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలపై గళం విప్పకపోతే, అది బీఆర్ఎస్ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆ ఒక్క రోజు రాకతో సరిపెట్టుకుంటారా లేక మళ్లీ సభలో అడుగుపెడతారా అన్నది వేచి చూడాలి.






