Venkaiah Naidu: ఓడినప్పుడు తప్పంటున్నవారు.. గెలిచినప్పుడు నోరు మెదపరే : వెంకయ్య నాయుడు
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లోని ఎన్నికల ప్రక్రియను వేలెత్తి చూపడం సరికాదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) హితవు పలికారు. సింగపూర్‌లోని (Singapore) శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఓడితే ఈవీఎం (EVM)ల తప్పు అంటున్న కొంతమంది అదే ఈవీఎంల ద్వారా గెలిచినప్పుడు మాత్రం తప్పుబట్టడం లేదని వ్యాఖ్యానించారు. కుటుంబంలో, సమాజంలో, దేశంలో ఐక్యత ఉన్నప్పుడే ప్రపంచం ప్రశాంతంగా ఉంటుందని పేర్కొన్నారు. గతంలో మనం ఐక్యంగా లేకపోవడం వల్లే చిన్నచిన్న దేశాలు కూడా వచ్చి, మనల్ని ఆక్రమించి సంపదను దోచుకెళ్లాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల వరకే ప్రత్యర్థులు, తర్వాత అందరం భారతీయులం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. భారత ఆర్థిక వ్యవస్థపై అవాంఛిత వ్యాఖ్యలు చేసే వారికి మన అభివృద్ధి ద్వారా ప్రధాని మోదీ (Modi) తగిన సమాధానం చెబుతున్నారని పేర్కొన్నారు.






