ATA: తెలుగు అకాడమీ మాజీ డైరెక్టర్ డా. వెల్చల కొండల్ రావుతో ఆటా బృందం భేటీ
హైదరాబాద్: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) బృందం ప్రముఖ విద్యావేత్త, తెలుగు సాహిత్యవేత్త, తెలుగు అకాడమీ మాజీ డైరెక్టర్ డా. వెల్చల కొండల్ రావును హైదరాబాద్లోని విశ్వనాథ సాహిత్య పీఠంలో మర్యాదపూర్వకంగా కలుసుకుంది. ఈ సమావేశంలో ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, మాజీ అధ్యక్షుడు పరమేష్ భీంరెడ్డి, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ కాశీ కోత పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీఠం నిర్వహిస్తున్న కార్యక్రమాలు, తెలుగు భాషా–సాహిత్య పరిరక్షణకు, అభివృద్ధికి చేస్తున్న సేవల గురించి ఆటా బృందం విస్తృతంగా అవగాహన పొందింది. 94 ఏళ్ల వయస్సులోనూ డా. కొండల్ రావు తెలుగు భాష, సాహిత్యాల కోసం అహర్నిశలు అంకితభావంతో పనిచేస్తూ, సాహిత్య ప్రపంచానికి నిరంతరం సేవలందించడం పట్ల ఆటా నాయకత్వం అభిమానం, హృదయపూర్వక కృతజ్ఞతలు వ్యక్తం చేసింది.
తెలుగు అకాడమీ మాజీ డైరెక్టర్గా ఆయన అందించిన సేవలు సహా, తెలుగు విద్యా–సాహిత్య రంగాలకు చేసిన ఆయన జీవితకాల సేవలు ఆదర్శనీయమని ఆటా నాయకత్వం కొనియాడింది. మహాకవి విశ్వనాథ సత్యనారాయణ సాహిత్య వారసత్వాన్ని భావితరాలకు అందించడంలో విశ్వనాథ సాహిత్య పీఠం పోషిస్తున్న పాత్రను ప్రశంసించింది. తెలుగు భాష, సాహిత్యం, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా మరింత బలోపేతం చేయాలనే ఆటా సంకల్పాన్ని ఈ సమావేశం మరింత దృఢం చేసింది.






