Kondagattu: ఆ ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డానో ఇప్పటికీ ఆశ్చర్యమే : పవన్
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) జగిత్యాల జిల్లా కొండగట్టు (Kondagattu) ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. రూ.35.19 కోట్ల టీటీడీ (TTD) నిధులతో భక్తుల వసతి కోసం 96 గదుల ధర్మశాల, దీక్ష విరమణ మండప నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నామంటే దేవుడి దయ ఉండాలి. కొండగట్టు నాకు పునర్జన్మనిచ్చింది. గతంలో జరిగిన విద్యుత్ ప్రమాదం నుంచి నేను ఎలా బయటపడ్డానో ఇప్పటికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. కొండగట్టు అంజన్నే నన్ను కాపాడారు. దీక్ష విరమణకు మండపం, సత్రం కావాలని గతంలో నన్ను కోరారు. టీటీడీ సభ్యులు, తెలంగాణ నాయకులు అందరి సమష్టి కృషితోనే ఇది సాధ్యమైంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు (BR Naidu), మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ (Adluri Lakshman Kumar) పాల్గొన్నారు.






