పాస్‌పోర్టు కోల్పోయిన తెలుగు డాక్టర్‌కు తానా-టీంస్క్వేర్ సహాయం
న్యూయార్క్‌లో పాస్‌పోర్టు కోల్పోయి ఇబ్బంది పడుతున్న తెలుగు డాక్టర్‌కు తానా-టీం స్క్వేర్ సహాయం చేయడంతోపాటు ఆయనకు పాస్ పోర్ట్‌ను తిరిగి ఇప్పించింది. బెర్ముడాలో ఉద్యోగం చేస్తున్న డాక్టర్ సుధాకర్ దాసరి ఇటీవల స్వదేశానికి వెళ్లేందుకు బయలుదేరగా న్యూయార్క్‌లో లేఓవర్ కోసం ఆగాల్సి వచ్చింది. ఈ సమయంలో ఆయన పాస్‌పోర్టు పోయింది. డాక్టర్ సుధాకర్ ఇబ్బంది గురించి తెలుసుకున్న టీం స్క్వేర్ చైర్పర్సన్ కిరణ్ కొత్తపల్లి, కో-చైర్పర్సన్ శ్రీనివాస్ భర్తవరపు, ఫౌండేషన్ ట్రస్టీ శ్రీనివాస్ కూకట్ల వెంటనే రంగంలోకి దిగారు. శ్రీనివాస్ భర్తవరపు స్వయంగా వెళ్లి సుధాకర్‌తో మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నారు. పాస్‌పోర్టు లేకపోవడంతో హోటల్ రూం బుకింగ్‌లో సుధాకర్‌కు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ సమస్యను పరిష్కరించిన శ్రీనివాస్ భర్తవరపు, పోర్ట్ అథారిటీ పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడి పాస్‌పోర్టు పోయిన విషయంపై ఫిర్యాదు చేయడంలో కూడా సహకారం అందించారు. అదే సమయంలో కిరణ్ కొత్తపల్లి స్వయంగా కలగజేసుకొని సుధాకర్‌కు మరో పాస్‌పోర్టు అందేలా అన్ని ఏర్పాట్లు చేసి సుధాకర్ స్వదేశం వెళ్ళేందుకు వీలు కల్పించారు. తానా టీమ్ స్క్వేర్ చేసిన సహాయానికి డాక్టర్ సుధాకర్ దాసరి ధన్యవాదాలు తెలిపారు.







