Virginia: వర్జీనియాలో ఘనంగా శ్రీనివాస కళ్యాణం

వర్జీనియా (Virginia) లో తిరుమలలో జరిగేటట్లుగా శ్రీనివాస కళ్యాణ వేడుకలను వైభవంగా నిర్వహించారు. క్యాపిటల్ ఏరియా రాయలసీమ అసోసియేషన్ (Capital Area Rayalaseema Association) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. తిరుమలను మరిపించేలా అర్చకులు స్వామివారి కళ్యాణ క్రతువును కన్నులపండువగా నిర్వహించారు. వేదిక పరిసరాలు గోవింద నామాలతో మార్మోగాయి. స్వామివారికి మంగళ స్నానాల అనంతరం పల్లకి సేవలో ఊరేగింపుగా తీసుకువచ్చారు. వేదికను రంగురంగుల తోరణాలు, పూలతో తీర్చిదిద్దారు. స్వామివారికి అభిషేకం, అర్చన వంటి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
వేద మంత్రోచ్చరణలు, మంగళ హారతులు, ప్రవాస చిన్నారులు అన్నమయ్య కీర్తనలు భక్తి పారవశ్యాన్ని కలిగించాయి. వేదిక పరిసరాలు గోవింద నామాలతో మార్మోగాయి. తీర్థప్రసాదాలు, అన్నదానం చేశారు. సుమారు మూడు వందల మందికి పైగా ఎన్నారై దంపతులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. కమ్యూనిటీ నాయకులు చంద్ర మలవతు, డా. మధుసూదన్ రెడ్డి కాశీపతి ఈ వేడుకలను సమన్వయపరిచారు. చంద్రమలవతు మాట్లాడుతూ, అమెరికాలో ఉండే స్వామివారి భక్తులకు తిరుమల వైభవాన్ని తెలియజేస్తూ, ఈ వేడుకలను నిర్వహించామని చెప్పారు. ఈ మహోత్సవం విజయవంతం కావడం తమ అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలు సజావుగా జరగడానికి సహకరించిన పండితులు, స్వచ్ఛంద సేవకులు, భక్తులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేశారు.
వర్జీనియా కాంగ్రెస్ ప్రతినిధి సుహాస్ సుబ్రహ్మణ్యం, తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి, సతీష్ వేమన, మన్నవ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.