డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు జరిగాయి. దుండగుడి జరిపిన కాల్పుల్లో ట్రంప్ కు గాయాలు అయ్యాయి. దీంతో పోలీసులు దుండగుడిపై కాల్పులు జరపగా, ఒకరు మృతి చెందారు. గాయపడిన ట్రంప్ ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన అమెరికాలోని పెన్సినియాలో చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్‌పై ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. భద్రతా సిబ్బంది దుండగుడిని కాల్చి చంపారు. అయితే ట్రంప్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగిస్తుండగా, దుండగుడు కాల్పులు జరిపాడు. కాల్పుల తర్వాత లేచి ‘ఫైట్’ అంటూ ట్రంప్ నినాదాలు చేశారు. ఈ ఘటనలో ట్రంప్ చెవికి బుల్లెట్ గాయమైంది. ఈ కాల్పుల ఘటనతో అమెరికా ఒక్కసారిగా ఉలిక్కి పడింది.
ఇదిలా ఉండగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ట్రంప్ క్షేమంగానే ఉన్నారని సీక్రెట్ సర్వీస్ చెబుతోంది. బట్లర్ కౌంటీ జిల్లా న్యాయవాది సీబీఎస్ పిట్స్బర్గ్ ఇద్దరు వ్యక్తులు చనిపోయారని నిర్ధారించారు. కాల్పులు జరగగానే ట్రంప్ తప్పించుకునేందుకు కిందికి వంగిపోయారు. చెవికి బుల్లెట్ గాయం కావడంతో ముఖంపై నుంచి రక్తం కారిపోయింది.
ట్రంప్ ను వేదికపై నుంచి దించగానే పిడికిలి పైకెత్తి నినాదాలు చేశారు. ఆయన భద్రత కోసం చర్యలు చేపట్టామని సీక్రెట్ సర్వీస్ ఒక ప్రకటనలో తెలిపింది
గాడ్ బ్లెస్ అమెరికా!
పెన్సిల్వేనియా ర్యాలీలో జరిగిన కాల్పుల్లో ఓ బుల్లెట్ తన కుడి చెవి పైభాగంలో నుంచి వెళ్లిందని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ట్రుత్ సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందించారు. సీక్రెట్ సర్వీస్ సిబ్బంది తన ప్రాణాల్ని కాపాడారన్నారు. వారికి ధన్యవాదాలు తెలిపారు. గాడ్ బ్లెస్ అమెరికా!’’ అని ట్రంప్ పోస్ట్ చేశారు.
హింసకు చోటు లేదు: జో బైడెన్
పెన్సిల్వేనియాలో డొనాల్డ్ ట్రంప్ ర్యాలీపై కాల్పులు జరిగినట్లు తనకు సమాచారం అందిందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ట్వీట్ చేశారు. ట్రంప్ ఆరోగ్యం మెరుగు పడాలని కోరారు. అమెరికాలో ఇలాంటి హింసకు తావు లేదు. దీనిని ఖండించడానికి మనం ఒక జాతిగా ఏకం కావాలి.. అని బైడెన్ అన్నారు.
బరాక్ ఒబామా ఆందోళన
మన ప్రజాస్వామ్యంలో రాజకీయ హింసకు తావు లేదని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ట్వీట్ చేశారు. ఏమి జరిగిందో మాకు ఇంకా ఖచ్చితంగా తెలియనప్పటికీ, మాజీ అధ్యక్షుడు ట్రంప్ కు పెద్దగా గాయపడలేదని, ఆయన ప్రాణానికి ఎలాంటి ఢోకా లేదని అన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరారు.
కాల్పులను తీవ్రంగా ఖండిస్తున్నా: ప్రధాని మోదీ
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై జరిగిన కాల్పుల ఘటనను యావత్ సమాజం తీవ్రంగా ఖండించింది. ప్రధానమంత్రి మోదీ సహా అమెరికా మాజీ అధ్యక్షులు, వ్యాపారవేత్తలు ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి హింసాయుత ఘటనలకు తావులేదని ముక్తకంఠంతో ఉద్ఘాటించారు. ‘‘నా స్నేహితుడు డొనాల్డ్ ట్రంప్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజకీయాల్లో హింసకు తావులేదు. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’’ అని మోదీ పేర్కొన్నారు.







