Dallas: డల్లాస్ లో భారత కాన్సులర్ సేవలు ప్రారంభం

వాషింగ్టన్ డి.సి.లోని భారత రాయబార కార్యాలయం డల్లాస్ (Dallas) నగరంలో ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్ (ICAC) ను ప్రారంభించింది. ఈ సందర్భంగా ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర (Dr Prasad Thotakura) హర్షం వ్యక్తం చేస్తూ ప్రవాస భారతీయల సంఖ్య అధికంగా ఉన్న డాలస్ నగరంలో ఇలాంటి ఒక కేంద్రం కావాలని ఎన్నో ఏళ్లగా భారత ప్రభుత్వాన్ని కోరుతున్నామని, అది ఇప్పటికి సాకారం కావడం సంతోషదాయకం అన్నారు. ప్రతి చిన్న కాన్సులర్ సేవకు డాలస్ నుండి హ్యుస్టన్ వెళ్లి రావడానికి పది గంటలకు పైగా సమయం వెచ్చించాల్సి వస్తోందని, ఇప్పుడు ఆ ప్రయాస తప్పుతోందని అన్నారు. శనివారంతో సహా వారానికి ఆరు రోజులు పనిచేసే ఈ కేంద్రం 8360 LBJ Free Way, Ste. # A 230, Dallas, TX లో నెలకొని ఉన్నదన్నారు. పాస్‌పోర్ట్ పునరుద్ధరణ, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా సేవలు, వీసా దరఖాస్తులు, జనన మరియు వివాహ రిజిస్ట్రేషన్లు వంటి కాన్సులర్ సేవలను ఈ కేంద్రంలో పొందవచ్చునని తెలిపారు. అమెరికాలో భారత రాయబారి వినయ్ క్వాట్రా, కాన్సల్ జనరల్ డి. సి మంజునాథ్, వి.ఎఫ్.స్ అధికారులకు ప్రవాస భారతీయుల తరపున డా. ప్రసాద్ తోటకూర ధన్యవాదాలు తెలిపారు.