సునీతా తిరిగొచ్చేది అప్పుడే : నాసా
భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ (58) వచ్చే ఫిబ్రవరి వరకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లోనే ఉండనున్నారు. ఆమెతో పాటు వెళ్లిన బుచ్ విల్మోర్ (61) కూడా అప్పుడే తిరిగి భూమ్మీదకు వస్తారని అమెరికా అంతరిక్ష పరిశోదన సంస్థ నాసా ప్రకటించింది. సునీతా, విల్మోర్ జూన్ 5న బోయింగ్ సంస్థకు చెందిన వ్యోమనౌక స్టార్లైన్లో ఐఎస్ఎస్కు వెళ్లారు. ప్రయాణికులను అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లేలా రూపొందించిన తొలి స్పేస్ క్రాఫ్ట్ స్టార్‌లైనర్. దీని పనితీరును అంచనా వేసేందుకు సునీతా, విల్మోర్ను ఐఎస్ఎస్కు పంపారు. అయితే అక్కడకు చేరుకోడానికి ముందే ప్రొపల్షన్ సిస్టమ్‌లో లీకులు బయటపడ్డాయి. దీనిద్వారా వ్యోమగాములను తిరిగి భూమ్మీదకు తీసుకురావడం అత్యంత ప్రమాదకరమని నాసా అంచనాకు వచ్చింది. ఈ నేపథ్యంలో టెస్లా అనుబంధ సంస్థ స్పేస్ ఎక్స్‌కు చెందిన క్రూ డ్రాగన్ వ్యోమనౌకలో తీసుకురావాలని నిర్ణయించింది. ఇక స్టార్ లైనర్ వచ్చే నెలలో ఖాళీగానే భూమికి చేరనుంది. కాగా, కేవలం 8 రోజుల స్వల్పకాలిక సమయానికి ఐఎస్ఎస్కు వెళ్లిన సునీతా, విల్మోర్ దాదాపు 8 నెలల పాటు అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.







