50 రాష్ట్రాల్లోనూ కరోనా ఆంక్షలు ఎత్తివేత
ఒక వైపు కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ అమెరికాలోని యాభై రాష్ట్రాలూ ఆంక్షలను ఎత్తివేయాలని, ఆర్థిక కార్యకలాపాలను తిరిగి ముమ్మరం చేయాలని నిర్ణయించాయి. కొత్తగా మళ్లీ వైరస్ విజృంభించే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నా, కరోనా మృతుల సంఖ్య నిరంతరం పెరుగుతూనే ఉన్నా ట్రంప్ మాత్రం ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణే తనకు ముఖ్యమంటున్నారు. మంగళవారం నాటికి అమెరికాలో మొత్తం 15 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య 91 వేలు దాటినట్టు జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ, కొన్ని రాష్ట్రాల ప్రజారోగ్యశాఖ అధికారులు తెలిపారు.
ప్రపంచ వ్యాపితంగా చూసినప్పుడు 48 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య 3,22,000కు చేరింది. ఈ సంవత్సరాంతానికి అమెరికా కరోనా మృతుల సంఖ్య మూడు రెట్లు పెరగవచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 50 రాష్ట్రాలకు గాను 17 రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య ఇప్పటికి పెరుగుతూనే ఉంది. ఈ పరిస్థితుల్లో ఆంక్షలను ఎత్తివేయడం వల్ల కరోనా వైరస్ మరింత విజృంభించే ప్రమాదముందని అమెరికన్ నిపుణులు, రాజకీయ నాయకులు ఆందోళన చెందుతున్నారు. న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ కౌమో మాట్లాడుతూ కరోనా నివారణ వ్యాక్సిన్ను ఎవరు కనుగొన్నా సరసమైన ధరలకు అది అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.






