ఇప్పటికిప్పుడు పరిష్కారం లభించే సమస్య కాదు ఇది- జయరాం కోమటి
తానా పూర్వ అధ్యక్షులుగా, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రతినిధిగా, తెలుగు ప్రముఖులుగా ఉన్న కాలిఫోర్నియా నివాసులు జయరాం కోమటి తెలుగు టైమ్స్ తో మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న కరోనా సంక్షోభం చాలా పెద్దదని, ఇప్పటికిప్పుడు అందరు కలిసి ఆలోచించినా పరిష్కారం లభించే చిన్న సమస్య కాదని అన్నారు. గత 3 నెలలుగా జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే ఒక్కోరోజు ఒక్కో రకంగా, ఒక్కో వారం ఒక్కో రకంగా గడుస్తోందని జయరాం అన్నారు.
ప్రభుత్వం కూడా అనేక నివారణ చర్యలు చేపట్టిందని, ఒక పక్క కరోనాకి చేసే పరీక్షల సంఖ్య పెంచడం, హాస్పటల్స్, క్వారంటైన్ సెంటర్లు పెంచడం చేస్తూనే, ఇంకో పక్క నిరుద్యోగులకు ఎదో ఒక పథకం ద్వారా కొంత సహాయం చేస్తూ ఉందని తెలిపారు. అన్ని తెలుగు సంఘాలు పరిస్థితులకు అనుగుణంగా చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, తానా కూడా అందరికంటే ముందు ఉండి, ఇటు అమెరికాలోనూ, అటూ తెలుగు రాష్ట్రాలలోనూ సేవా కార్యక్రమాలు చేస్తోందని, అందుకు అన్నీ తెలుగు సంఘాలను అభినందించాలని జయరాం అన్నారు.
ఈ పరిస్థితుల మన తెలుగు వారి జీవనం, అందరి లాగే ఇంటికి పరిమితం అయింది తప్పితే, ఎలాంటి ఇబ్బందులకు లోను అవలేదని, కరోనా వలన ఉద్యోగాలు పోయిన వారి సంఖ్య తెలుగువారితో చాలా తక్కువ అని, వారు కూడా వెంటనే ఆ ఇబ్బందుల నుంచి బయటపడతారని ఆశిస్తున్నట్లు జయరాం అన్నారు.






